Begin typing your search above and press return to search.

కేటీఆర్ కే షాకిచ్చిన నయా మోసగాడు.. మంత్రి పీఏ అంటూ టోకరా

By:  Tupaki Desk   |   15 Feb 2020 5:23 PM GMT
కేటీఆర్ కే షాకిచ్చిన నయా మోసగాడు.. మంత్రి పీఏ అంటూ టోకరా
X

మోసాలకు కొత్త హంగులు జోడిస్తూ లక్షల్లో టోకరా వేస్తున్నారు నయా మోసగాళ్లు. ట్రెండింగ్ లో ఉన్న అంశాన్ని అస్త్రంగా వాడుకొని బడా సంస్థలకే కుచ్చుటోపీ పెట్టిన ఓ యువకుడిని వలవేసి పట్టుకున్నారు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. కేటీఆర్ పీఏ పేరుతో మోసాలకు పాల్పడిన ఆ యువకుడు మాజీ రంజీ లెవల్ క్రికెటర్ కావడం ఆసక్తికర అంశం.

నాగరాజు అనే క్రికెట్ ప్లేయర్ ఇండియా టీమ్ అండర్ 25 వరల్డ్ కప్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్‌లకు సెలెక్ట్ అయ్యాడంటూ.. తన గురించి తానే చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు. కేటీఆర్ పీఏ తిరుపతి రెడ్డి పేరు వాడుకుంటూ బాగా సంస్థలకు గాలం వేశాడు. తాను కేటీఆర్ పీఏని అని చెప్పుకుంటూ.. పలు కంపనీల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేశాడు నాగరాజు. ఇండియన్ క్రికెట్ టీమ్‌‌కు ఓ నిరుపేద యువకుడు ఎంపికయ్యాడని, అతనికి స్పాన్సర్స్ కావాలని పేర్కొంటూ కేటీఆర్ పిఏ పేరుతో ఫోన్ కాల్స్ చేయడం మొదలు పెట్టాడు. ఈ మేరకు ట్రూ కాలర్‌లో తన మొబైల్ నెంబర్‌ ని కేటీఆర్ పీఏ అని వచ్చేలా సెట్ చేశాడు. దీంతో నాగరాజు మాటలు నమ్మిన కొన్ని సంస్థలు లక్షల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాయి.

అంతేకాదు ఫిబ్రవరి 9న కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని, ఎల్బీ స్టేడియంలో జరగబోయే ఈ ప్రమాణస్వీకారం సభలో స్పాన్సర్ షిప్ ఇప్పిస్తానని మరోసారి మోసానికి యత్నించాడు. కానీ ఈ సారి అనూహ్యంగా పోలీసులకు చిక్కిపోయాడు. నాగరాజుకు లక్షలు చెల్లించిన ప్రైమ్ ఇండియా కంపెనీ యాజమాన్యం అనుమానంతో అతని పేరును గూగుల్‌లో సెర్చ్ చేసి.. చివరకు అతనో చీటర్ అని తెలుసుకున్నారు.

ఈ మేరకు తాము నాగరాజు చేతిలో మోసపోయామంటూ హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నాగరాజు స్వస్థలం శ్రీకాకుళం అని తెలిసింది. నాగరాజు నయా మోసం గురించి విని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం షాక్ అయ్యారని సమాచారం.