Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో సామాజిక న్యాయం ఏది జ‌గ‌న‌న్న‌?

By:  Tupaki Desk   |   19 July 2022 10:30 AM GMT
ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో సామాజిక న్యాయం ఏది జ‌గ‌న‌న్న‌?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వచ్చే ఏడాది జరగనున్న మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయాల‌ని వైఎస్సార్సీపీ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు రెడ్డి సామాజికవర్గానికి.. మరొకటి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్‌కు ఇచ్చారు. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ కు, అనంతపురం-కడప-కర్నూలుకు వెన్నపూస రవీంద్రరెడ్డి, చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు.

ఈ నేప‌థ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపికలో సామాజిక న్యాయ‌మేది అని సీఎం జ‌గ‌న్ ను నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా ఎంపిక చేసిన ముగ్గురిలో ఇద్ద‌రు రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. అందులోనూ పేర్నాటి శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి భార్య సుష్మితారెడ్డి రాష్ట్ర విత్త‌నాభివృద్ధి కార్పొరేష‌న్ కు చైర్ ప‌ర్సన్ గా ఉన్నార‌ని చెబుతున్నారు. వెన్న‌పూస ర‌వీంద్ర‌రెడ్డి ప్ర‌స్తుత ఎమ్మెల్సీ వెన్న‌పూస గోపాల‌రెడ్డి కుమారుడు కావ‌డం గ‌మ‌నార్హం. వెన్న‌పూస గోపాల‌రెడ్డి ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీలోనే ఉన్నారు.

రాయ‌ల‌సీమ జిల్లాలు, ఒంగోలు, నెల్లూరు వంటి చోట్ల మాత్రం బీసీలు, ఎస్సీ, ఎస్టీల‌కు ఎమ్మెల్సీలుగా అవ‌కాశం ఇవ్వ‌ర‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ జిల్లాల్లో రెడ్డి సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని ఎద్దేవా చేస్తున్నారు. అదే ఉత్త‌రాంధ్ర జిల్లాలు, ఇత‌ర జిల్లాల్లో రెడ్లు కాకుండా ఇత‌ర‌ అగ్ర వ‌ర్ణాలు అధికంగా ఉన్న‌చోట మాత్రం బీసీల‌కు, ఎస్టీ, ఎస్సీల‌కు సీట్లు ఇస్తార‌ని.. పైగా దీనికి సామాజిక న్యాయం అని పేరు పెడ‌తార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీలు ఎక్కువ‌ని.. అక్క‌డ ఏ పార్టీ అయినా బీసీల‌కే ఇస్తుంద‌ని.. ఇందులో జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా చేసే సామాజిక న్యాయం ఏదీ లేద‌ని అంటున్నారు.

త‌న రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఉన్న చోట మాత్రం అది ఏ ఎన్నిక‌యినా రెడ్ల‌కే సీట్లు క‌ట్ట‌బెడ‌తార‌ని గుర్తు చేస్తున్నారు. అక్క‌డ మాత్రం బీసీలు, ఎస్సీ, ఎస్టీలు గుర్తుకు రార‌ని ఎద్దేవా చేస్తున్నారు. ఇత‌ర అగ్ర కులాలు అధిక సంఖ్య‌లో ఉన్న గుంటూరు, కృష్ణా, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో మాత్రం ఎస్సీ, ఎస్టీల‌కు, బీసీల‌కు సీట్లు ఇచ్చి తాము సామాజిక న్యాయం చేస్తున్నట్టు జ‌గ‌న్ క‌ల‌ర్ ఇస్తార‌ని నెటిజ‌న్ల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.

గతంలో గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కూడా కల్పలతా రెడ్డి అనే ఆమెకు చాన్సిచ్చార‌ని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో సామాజిక న్యాయం పాటిస్తే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం మూడు అగ్రవర్ణాలకే కేటాయించార‌ని నిట్టూరుస్తున్నారు.

పేర్నాటి శ్యాంప్ర‌సాద్‌రెడ్డి ఎంపికపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న ప్ర‌స్తుతం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఒకే రోజు ఆయ‌న‌ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం, అదే రోజు ఆయ‌న‌ న‌కిలీ మ‌ద్యం కేసులో విచార‌ణకు హాజ‌ర‌వ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ప‌త్రిక‌లు వార్త‌లు ప్ర‌చురించాయి. త‌న‌ను సెబ్ అధికారులు వేధిస్తుండ‌డంపై కేంద్ర‌, రాష్ట్ర మాన‌వ హ‌క్కుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని ఆయ‌న అంటున్నారు.

న‌కిలీ మ‌ద్యం కేసులో కావ‌లి ఎమ్మెల్యే ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఉన్నార‌ని స్వ‌యంగా ఆయ‌నే ఆరోపించ‌డం విశేషం. త‌న‌ను సెబ్ అధికారులు విచార‌ణ‌కు పిలుస్తున్నార‌ని.. వారిద్ద‌రినీ ఎందుకు విచార‌ణ‌కు పిల‌వ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. రాష్ట్ర‌స్థాయిలో పెద్ద‌ల స‌భ‌కు ఇలాంటి నాయ‌కుడినా పంపేద‌ని టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది.