Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు బినామీలా?

By:  Tupaki Desk   |   10 Dec 2016 10:37 AM GMT
ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబు బినామీలా?
X
భారీగా నగదు, బంగారంతో దొరికిన టీటీడీ బోర్డుసభ్యుడు శేఖర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది. టీటీడీ బోర్డు నుంచి ఆయన్ను తొలగిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో నియమించారు. అయితే... తాజా పరిణామాల నేపథ్యంలో శేఖరరెడ్డిని తమిళ ప్రభుత్వ పెద్దల సూచనతోనే నియమించానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, ఆ పెద్దలు ఎవరన్నది మాత్రం ఆయన వెల్లడించడం లేదు.

చంద్రబాబు ఏం చెప్పినా కానీ... ఆయన, శేఖర్ రెడ్డి ఉన్న ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శేఖర్ రెడ్డి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఏపీకి చెందిన ముఖ్యనేతతో ఒక ప్రముఖ హోటల్‌లో సమావేశమవుతుంటారని చెబుతున్నారు. శేఖర్ రెడ్డి దగ్గర పట్టుబడిన డబ్బులో ఏపీకి చెందిన అధికార పార్టీ నేతల సొమ్ము కూడా ఉందని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో శేఖరరెడ్డి వ్యవహారం తమ మెడకు చుట్టుకోకుండా వెంటనే ఏపీ గవర్నమెంటు ఆయన్ను టీటీడీ బోర్డు నుంచి తప్పించింది.

కాగా టీడీపీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ రెడ్డి, డీకే సత్యప్రభ ఇళ్లలోనూ కొద్ది రోజుల క్రితం ఐటీ దాడులు జరిగాయి. ఇద్దరి ఇళ్లలోనూ కోట్లాది రూపాయలు బయపడ్డాయి. డీకే సత్యప్రభ ఇల్లు మరియు మెడికల్ కాలేజ్‌లో వంద కోట్లకుపైగా నగదు దొరికింది. కానీ వేణుగోపాల్ రెడ్డి, సత్యప్రభలపై చంద్రబాబు వేటు వేయలేదు. మరి శేఖరరెడ్డిపై వేటు వేసినట్లే వారిపై ఎందుకు వేటు వేయలేదన్న ప్రశ్న వినిపిస్తోంది. వారేమైనా చంద్రబాబు బినామీలా అని విపక్ష నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు.