Begin typing your search above and press return to search.

ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా ఇంటికి కొత్త నోట్లు

By:  Tupaki Desk   |   15 Dec 2016 4:10 AM GMT
ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా ఇంటికి కొత్త నోట్లు
X
పెద్ద నోట్ల రద్దుతో యావత్ దేశ ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏటీఎంలలో వచ్చే రూ.2000 వేల కోసం గంటల కొద్దీ వెయిట్ చేసే పరిస్థితి. బ్యాంకుల్లో నగదు విత్ డ్రా మొత్తం వారానికి రూ.24 వేలు ఉన్నప్పటికీ.. నగదు కొరత కారణంగా రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు మాత్రమే ఇస్తున్న దుస్థితి. కొన్ని బ్యాంకుల్లో.. కొంతమంది ఖాతాదారులకు.. తమకున్న పరిచయంతో నిబంధనలకు అనుగుణంగా మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్న వైనాలు కనిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే.. నోట్ల కొరత సామాన్య ప్రజానీకం మీద భారీగా ఉందని చెప్పాలి. ఎంత అవసరమైనా.. నగదు మొత్తాన్ని ఒక పరిమితికి దాటి చేతికి అందటం లేదు. కానీ.. కొందరికి మాత్రం ఇలాంటి రూల్స్ ఏమీ వర్క్ వుట్ కావటం లేదు. వారు అనుకున్నదే తడవు.. ప్రింటింగ్ ప్రెస్ ల నుంచే నేరుగా ఇళ్లకు కొత్త కరెన్సీ చేరుతున్న వైనం షాకింగ్ గా మారింది.

తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్.. టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఎపిసోడ్ అందరికి తెలిసిందే. కొత్త నోట్ల కోసం దేశ ప్రజలు కిందామీదా పడుతున్న వేళ.. అతగాడి ఇంట్లో మాత్రం వందల కోట్ల రూపాయిలు నోట్ల కట్టలు దర్శనం ఇవ్వటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అతగాడి ఇంట్లో అధికారులు జరిపిన తనిఖీల్లో కొత్త నోట్ల కట్టలు ఏకంగా రూ.131 కోట్లు దొరకటంతో నోట మాట రాని పరిస్థితి. నోట్ల కట్టలే కాదు.. 170 కేజీల బంగారం దొరకటంతో అవాక్కు అయ్యే పరిస్థితి.

ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.131 కోట్ల నోట్ల కట్టల్లో కొత్తగా విడుదలైన రూ.2వేల నోట్ల కట్టలే రూ.34 కోట్ల మేర ఉండటంతో.. ఇంత భారీ మొత్తం ఆయనకు ఎలా వచ్చాయన్న కోణంలో అధికారులు దృష్టి సారించారు. ఆయన ఇంట్లో దొరికిన రూ.2వేల నోట్ల సీరియల్ నెంబర్ల ఆధారంగా వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న అంశంపై ఫోకస్ చేసినప్పుడు.. ఊహించని రీతిలోవాస్తవం ఒకటి బయటకు వచ్చింది. ఆయన ఇంటికి వచ్చిన కొత్త రూ.2వేల నోట్ల కట్టలన్నీ ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా వచ్చినట్లు తేలింది.

నిజానికి కొత్త నోట్ల ప్రింట్ అయ్యాక ప్రింటింగ్ ప్రెస్ నుంచి రిజర్వ్ బ్యాంకుకు.. అక్కడి నుంచి బ్యాంకులకు వెళతాయి. కానీ.. స్టేట్ బ్యంక్ కు చెందిన కొన్ని కార్యాలయాలకు ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా కరెన్సీ కట్టలు వచ్చేశాయి. శేఖర్ రెడ్డికి ఉన్న ‘పవర్’తో.. ప్రింటింగ్ ప్రెస్ నుంచి బ్యాంకుకు వెళ్లకుండానే ఆయన ఇంటికి చేరినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇందుకు కారణమైన స్టేట్ బ్యాంక్ అధికారులు కొందరిని త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. రూ.2వేల కోసం గంటల తరబడి సామాన్యుడు క్యూలో నిలుచుంటే.. బడాబాబులు మాత్రం కరెన్సీకట్టల్ని ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా తెప్పించుకోవటం చూస్తుంటే.. పెద్ద నోట్ల రద్దు బడాబాబుల కంటే.. సామాన్యులకే భారీ కష్టాల్ని తీసుకొచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/