Begin typing your search above and press return to search.

లోకేశ్ బ‌దులు...శేఖ‌ర్ రెడ్డి లైన్లోకొచ్చాడే!

By:  Tupaki Desk   |   15 March 2018 8:18 AM GMT
లోకేశ్ బ‌దులు...శేఖ‌ర్ రెడ్డి లైన్లోకొచ్చాడే!
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... నిన్న గుంటూరు జిల్లాలో నిర్వ‌హించిన పార్టీ ఆవిర్భావ వేదిక నుంచి చేసిన ప్ర‌సంగం నిజంగానే ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంద‌ని చెప్పాలి. ఏపీకి ప్ర‌త్యేక హోదా - కేంద్రంపై పోరాటం - రాష్ట్రంలో అవినీతి పాల‌న‌ - అధికార పార్టీ నేత‌ల దుర్మార్గాలు త‌దిత‌రాల‌న్నీ కూడా కామ‌నే అయినా... టీడీపీకి ప్ర‌త్యేకించి ఆ పార్టీ అదినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి న‌మ్మిన బంటులా ముద్ర ప‌డిన ప‌వ‌న్‌... నిన్న ఏకంగా చంద్ర‌బాబు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సంధించిన ఆరోప‌ణ‌లే ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారిపోయాయ‌ని చెప్పాలి. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలోనే కాకుండా ఏపీ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న లోకేశ్... అవినీతికి పాల్ప‌డ్డార‌ని - ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారుల సోదాల్లో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డ త‌మిళ‌నాడు బడా కాంట్రాక్ట‌ర్ - తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క‌మండ‌లి మాజీ స‌భ్యుడు శేఖ‌ర్ రెడ్డికి చెందిన కుంభ‌కోణంలో లోకేశ్ కు కూడా పాత్ర ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయ‌ని - ఈ వార్త‌లు నిజ‌మేనా? అని ప‌వ‌న్ ప్రశ్నించిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా చంద్ర‌బాబుకు తెలిసే లోకేశ్ అవినీతికి పాల్ప‌డుతున్నారా? అని కూడా ప‌వ‌న్ కాస్తంత సూటిగానే ప్ర‌శ్నించారు.

మొత్తంగా టీడీపీ ఏలుబ‌డిలో ఉన్న ఏపీలో ఆ పార్టీ నేత‌ల‌తో పాటుగా పార్టీ అధినేత‌ - ప్ర‌భుత్వాధినేత కుటుంబం కూడా అవినీతికి పాల్పడుతోందంటూ ప‌వ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లే చేశారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై నిన్న రాత్రే టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్ర‌సాద్‌ - ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లంకా దిన‌క‌ర్ లాంటి కొంద‌రు స్పందించేందుకు మీడియా ముందుకు వ‌చ్చారు. చంద్ర‌బాబు కుటుంబంపై ప‌వ‌న్ నేరుగా ఎదురు దాడి చేయ‌డం స‌బ‌బు కాద‌ని - అస‌లు చంద్ర‌బాబు ఫ్యామిలీపై ఆరోప‌ణ‌లు చేసే హ‌క్కు ప‌వ‌న్‌కు లేద‌న్న‌ట్టుగా వారిద్ద‌రూ త‌మ‌దైన స్టైల్లో స్టేట్ మెంట్లిచ్చారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించ‌డానికి నేరుగా లోకేశ్ రంగంలోకి దిగితే త‌ప్పు లేదు గానీ... లోకేశ్ ఆ ప‌ని చేయ‌లేదు. ప‌వ‌న్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించేందుకు లోకేశ్ కు ఏ కార‌ణం క‌నిపించిందో తెలియ‌దు గానీ... లోకేశ్ అవినీతిని ప‌వ‌న్ ఎవ‌రితో ముడిపెట్టారో స‌ద‌రు వ్య‌క్తి మాత్రం వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయారు. ఆ వ్య‌క్తే శేఖ‌ర్ రెడ్డి.

అందుబాటులో ఉన్న నోట్ల‌న్నీ ర‌ద్దై ఒక్క నోటుకు కూడా గంట‌ల త‌ర‌బ‌డి బ్యాంకులు - ఏటీఎంల ముందు జ‌నం క్యూ క‌డుతుంటే.. టీటీడీ బోర్డు స‌భ్యుడి హోదాలో ఉన్న శేఖ‌ర్ రెడ్డి మాత్రం వంద‌ల కోట్ల రూపాయల విలువ చేసే రూ.2000 నోట్ల‌ను త‌న ఇంటిలో దాచేసుకున్నాడు. ఐటీ శాఖ దాడుల్లో ఈ భాగోతం వెలుగు చూడ‌గా... శేఖ‌ర్ రెడ్డిని టీటీడీ బోర్డు నుంచి టీడీపీ ప్ర‌భుత్వం త‌ప్పించేసింది. ఇదంతా గ‌త‌మ‌నుకుంటే... నిన్న ప‌వన్ క‌ల్యాణ్ చేసిన ఆరోప‌ణ‌ల‌తో నేటి ఉద‌యమే మీడియా ముందుకు వ‌చ్చిన శేఖ‌ర్ రెడ్డి... అస‌లు తాను ఏనాడూ లోకేశ్ ను క‌ల‌వ‌నే లేద‌ని ఓ భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. అయినా త‌మిళ‌నాడులో కాంట్రాక్టు ప‌నులు చేసుకునే త‌న‌కు ఏపీకి చెందిన లోకేశ్ తో ప‌నేముంటుంద‌ని కూడా ఆయ‌న త‌న‌దైన శైలి వాద‌న‌ను వినిపించారు. లోకేశ్ తోనే కాకుండా ఏపీకి చెందిన ఏ ఒక్క రాజ‌కీయ నేత‌తోనూ త‌న‌కు ప్ర‌త్య‌క్ష సంబంధాలు లేవ‌న్న కోణంలో శేఖ‌ర్ రెడ్డి త‌న వాద‌న‌ను వినిపించారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు స‌భ్యుడిగా త‌న‌కు అవకాశం ద‌క్కిన వైనాన్ని కూడా ఆయ‌న ఏక‌రువు పెట్టారు. త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత సిఫార‌సు మేర‌కే త‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్కింద‌ని - త‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌డంలో టీడీపీకి ఎలాంటి సంబంధం లేద‌ని కూడా ఆయ‌న చెప్పారు. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని కూడా తాను రెండంటే రెండు సార్లు మాత్ర‌మే క‌లిశాన‌ని - ఈ క్ర‌మంలో లోకేశ్ తో త‌న‌కు సంబంధం ఎలా అంట‌గ‌డ‌తార‌ని కూడా శేఖ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు.

ఇదంతా బాగానే ఉన్నా... ప‌వ‌న్ నోట త‌న పేరు వినిపించిన వైనంపై శేఖ‌ర్ రెడ్డి ఓ ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపించారు. త‌న పేరు ప‌లికితే ల‌క్ ద‌క్కుతుంద‌ని చాలా మంది రాజ‌కీయ నేత‌లు భావిస్తుంటార‌ని - అలా త‌మిళ‌నాడులో చాలా మంది త‌న నామ‌స్మ‌ర‌ణ చేస్తుంటార‌ని - ఈ విష‌యాన్ని తెలుసుకున్న త‌ర్వాతే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న పేరును ప్ర‌స్తావించి ఉంటార‌ని కూడా ఆయ‌న ఓ త‌న‌దైన శైలి సెటైర్ ను సంధించారు. అయినా శేఖ‌ర్ రెడ్డిని ఐటీ శాఖ రెడ్ హ్యాండెడ్‌ గా ప‌ట్టుకుంది. ఈ కేసులో ఆయ‌న జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇలాంటి నేప‌థ్యంలో ఆయ‌న పేరును ప‌వ‌న్ నేరుగా ఏమీ ప్ర‌స్తావించ‌లేదు. లోకేశ్ అవినీతిని ప్ర‌స్తావిస్తూనే శేఖ‌ర్ రెడ్డి ప్ర‌స్తావ‌న తెచ్చారు. మ‌రి ప‌వ‌న్ ఆరోప‌ణ‌లను ఖండించాల్సిన అవ‌స‌రం లోకేశ్ కు త‌ప్పించి శేఖ‌ర్ రెడ్డికి లేద‌నే చెప్పాలి. అయితే అందుకు విరుద్ధంగా లోకేశ్ సైలెంట్‌ గానే ఉండిపోగా... ఎవ‌రో చెప్పిన‌ట్లుగా శేఖ‌ర్ రెడ్డి ఆఘ‌మేఘాల మీద మీడియా ముందుకు వ‌చ్చి త‌న‌కు లోకేశ్ తో ఎలాంటి సంబంధాలు లేవ‌ని చెప్ప‌డం చూస్తుంటే... గుమ్మ‌డి కాయ‌ల దొంగ అంటే భుజాలు త‌డుముకున్న‌ట్లుగానే ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.