Begin typing your search above and press return to search.

కొవిషీల్డ్ ఏ దేశంలో ఎంతో తెలిస్తే.. షాక్ తినాల్సిందే

By:  Tupaki Desk   |   25 April 2021 4:30 AM GMT
కొవిషీల్డ్ ఏ దేశంలో ఎంతో తెలిస్తే.. షాక్ తినాల్సిందే
X
కరోనా వ్యాక్సిన్ కు ముందు సీరం సంస్జ కానీ.. దాని సీఈవో అదర్ పూనావాలా పెద్ద పరిచయం లేదు. కొందరికి మాత్రమే ఆయన సుపరిచితుడు. కోవిషాల్డ్ పుణ్యమా అని ఆయన చాలా ఫేమస్ అయ్యారు. దేశంలో వాడుతున్న రెండు టీకాల్లో సీరం వారి కోవిషీల్డ్ ఒకటన్న విషయం తెలిసిందే. నిన్నటివరకు వ్యాక్సిన్ ధర విషయంలో కేంద్రం పాలసీకి తగినట్లుగా నడుచుకున్న సీరం..ఈ మధ్యనే మోడీ సర్కారు ప్రకటించిన కొత్త వ్యాక్సిన్ పాలసీతో.. షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కేంద్రానికి కారుచౌకగా వ్యాక్సిన్ ఇచ్చే సీరం సంస్థ.. రాష్ట్రాలకు.. ప్రైవేటు సంస్థలకు ఇచ్చే టీకా ధర భారీగా నిర్ణయించటం షాకింగ్ గా మారింది.

అదేమంటే ఆయన చెబుతున్న కారణాలు విచిత్రంగా ఉన్నాయి. తమ టీకా ఉత్పత్తి పెంచటం కోసం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టామని.. ఈ నేపథ్యంలో టీకా ధర పెంచక తప్పదని ఆయన చెబుతున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే.. విదేశాల్లో తక్కువ ధరలకు టీకా వస్తున్న కోవిషీల్డ్.. భారత్ లో మాత్రం అందుకు భిన్నంగా ధరను ఫిక్స్ చేయటం గమనార్హం. మీడియా చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ.. ధరను పెంచక తప్పదని చెబుతున్నారు. భారత్ లో రూ.600 ఒక్కో డోసును ఇస్తామని చెబుతున్న సీరం సంస్థ.. పలు దేశాల్లో మాత్రం అందుకు భిన్నంగా తక్కువ ధరకు అందిస్తోంది.

దేశం డోసు ధర (రూ)
భారత్ 600
సౌదీ 393
సౌతాఫ్రికా 393
అమెరికా 300
బంగ్లాదేశ్ 300
ఈయూ 263
బ్రెజిల్ 236
బ్రిటన్ 225
తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను భారత్ లో అత్యధిక ధరకు అమ్మనున్న కోవిషీల్డ్.. అతి తక్కువగా బ్రిటన్ కు ఎగుమతి చేయనుండటం విశేషం. దేశ ప్రజలకు రూ.600 ఒక్కో డోసు అందిస్తామని పూనావాలా చెబుతూ.. అందరి కంటే అతి తక్కువ ధరకు బ్రిటన్ కు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకోవటం విశేషం. బ్రిటన్ కు కోవిషీల్డ్ టీకా ఒక్కొక్కటి రూ.225 మాత్రమే ఇవ్వనున్నారు. మారిన పరిస్థితుల కారణంగా వ్యాక్సిన్ ధరలు పెంచటక తప్పటం లేదన్న పూనావాలా మాటలు ఒక పట్టాన మింగుడుపడవివిగా మారాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. విదేశాల్లో తక్కువ ధరకు అమ్ముతున్న కోవిషీల్డ్ దేశంలో మాత్రం అంత భారీ ధరను నిర్ణయించారేమిటన్న ప్రశ్నకు.. ఆయన నుంచి వస్తున్న సమాధానం ఏ మాత్రం మింగుడుపడనిదిగా మారింది. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుతో పోల్చినప్పుడు కోవిషీల్డ్ ధర తక్కువే కదా అన్న ఆయన చమత్కారం చూస్తే.. అసలుసిసలు వ్యాపారస్తుడు పూనావాలలో కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. సొంత ప్రజలు ప్రాణలతో పోరాడుతున్న వేళ.. కరోనా నుంచి తప్పించుకునే ఆదుర్దాను తాను సొమ్ము చేసుకోవాలనుకోవటానికి మించిన విషాదం ఇంకేం ఉంటుంది?