Begin typing your search above and press return to search.

రాజీవ్ ను అందుకే చంపాం..ఎన్నికల ప్రచారంలో కొత్త వివాదం!

By:  Tupaki Desk   |   15 Oct 2019 10:26 AM IST
రాజీవ్ ను అందుకే చంపాం..ఎన్నికల ప్రచారంలో కొత్త వివాదం!
X
మాజీ ప్రధాని.. దివంగత రాజీవ్ గాంధీ హత్యోదంతం మరోసారి పెను దుమారాన్ని రేపింది. రాజీవ్ చేసిన తప్పునకే ఆయన్ను హత్య చేసినట్లుగా బరితెగింపు వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బరితెగింపునకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ నామ్ తమిళకర్ కట్చి అధినేత సీమాన్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఉద్రిక్తతకు తెర తీశాయి. తమిళనాడులో తాజాగా ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో సాగుతున్న ప్రచారం మరో వివాదానికి కారణమైంది.

శాంతి ఒప్పందం పేరుతో శ్రీలంకతో రాజీవ్ గాంధీ రాయబారం చేయటంతోనే తాము మట్టుబెట్టినట్లుగా సీమన్ వ్యాఖ్యలు చూస్తే.. భారతదేశంలోనే ఇలాంటివి సాధ్యమేమో అన్న భావన కలుగక మానదు. మాజీ ప్రధానిని అత్యంత కిరాతకంగా మానవబాంబుతో హతమార్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత దారుణమైన వ్యాఖ్యలకు తెగబడటం గమనార్హం.

తమిళనాడులోని నాంగునేరి.. విక్రవాండి.. పుదుచ్చేరిలోని కామరాజనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా ఎల్టీటీఈ సానుభూతిపరుడైన సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దళాల్ని శ్రీలంకకు పంపి తమ వర్గాన్ని హతమార్చిన రాజీవ్ గాంధీని తమిళభూమిలోనే మట్టుబెట్టినట్లుగా దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు.

సీమాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇంటి ముందు.. పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సీమాన్ పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. 19 ఏళ్ల క్రితం జరిగిన మాజీ ప్రధాని రాజీవ్ దారుణ హత్యపై పరుష వ్యాఖ్యలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.