Begin typing your search above and press return to search.

విష వాయువు లీక్ కు కారణమైన వస్త్ర పరిశ్రమ మూసివేత!

By:  Tupaki Desk   |   4 Jun 2022 8:30 AM GMT
విష వాయువు లీక్ కు కారణమైన వస్త్ర పరిశ్రమ మూసివేత!
X
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లోని సీడ్స్‌ వస్త్రపరిశ్రమను తాత్కాలికంగా మూసివేశారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక.. కమిటీ సూచనల మేరకే కంపెనీ తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

అచ్యుతాపురం సెజ్ లోని సీడ్స్‌ కంపెనీ నుంచి జూన్ 3న మధ్యాహ్నం 12గంటలకు గాఢమైన విషవాయువు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో అందులో పని చేస్తున్న 300 మంది ఉద్యోగినులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. శ్వాస అందకపోవడంతో బయటకు పరుగులు తీశారు. అయితే బయట వాతావరణంలోని గాఢ విషవాయువు మరింత తీవ్రంగా వ్యాపించడంతో ఊపిరి తీసుకోవడం వారికి కష్టంగా మారింది. వాంతులు చేసుకుంటూ పడిపోయారు. ముఖ్యంగా కంపెనీలో షిప్ట్-ఎలో పనిచేస్తున్న 2000 మందిలో ఎక్కువ మంది శ్వాస అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

బాధితులను కంపెనీ అంబులెన్సులు, ఇతర వాహనాల్లో తొలుత అచ్యుతాపురానికి తరలించారు. అక్కడి ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో అనకాపల్లిలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా ఈ ప్రమాదంలో ఏడు నెలల గర్భిణులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.

ప్రమాదం జరిగిన 4గంటల తరువాత 120 మంది బాధితులను అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తరలించారని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అప్పటిదాకా వారిని పట్టించుకోలేదని కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 120 మంది కాక మిగిలిన వారిని అనకాపల్లిలోనే వివిధ ప్రైవేటు ఆసుపత్రిల్లో చేర్చారు.

అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌, ఎమ్మెల్యే కన్నబాబురాజు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా ఎస్పీ గౌతమి సాలి వచ్చి సీడ్ కంపెనీని పరిశీలించారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటో వారు ప్రకటించలేదు. అలాగే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి కూడా కంపెనీని సందర్శించారు.

మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ ఘటనపై మండిపడ్డారు. గతంలో ఎల్జీ పాలిమర్స్ లో ఇలాగే రసాయన విష వాయువులు వెలువడి పలువురు మరణించినా ప్రభుత్వం ఇంకా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కంపెనీలపై ప్రభుత్వ పర్యవేక్షణ, నిఘా లేవని ధ్వజమెత్తారు. విష వాయువులు లీకైన ఘటనలో బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.