Begin typing your search above and press return to search.

బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కి రంగం సిద్ధం .. ఎవరికోసమంటే

By:  Tupaki Desk   |   25 Sep 2021 8:30 AM GMT
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కి రంగం సిద్ధం .. ఎవరికోసమంటే
X
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌ లో భాగంగా భారతదేశంలోనే తొలి "బ్యాడ్ బ్యాంక్" ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ను ఇప్పటికే కంపెనీల చట్టం కింద చేర్చామని ఆమె వెల్లడించారు. బ్యాడ్ బ్యాంక్ వివిధ దశల్లో వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలకు సంబంధించిన ఆస్తులను పొందుతుందన్నారు. ఆ ఆస్తులను మార్కెట్లో విక్రయించడానికి ఇటీవలే స్థాపించిన ఇండియా డెబ్ట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రయత్నిస్తుందని చెప్పారు. నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ నిర్మాణమే కొత్త బ్యాడ్ బ్యాంక్. ఈ బ్యాంకు పని చేయడం కోసం మొత్తం రూ.30,600 కోట్ల విలువైన రశీదులకు కేంద్రం హామీ ఇస్తుందని వెల్లడించారు.

ప్రతి దేశంలోని వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లను స్వీకరించి రుణాలు అందిస్తాయి. బ్యాంకులు డిపాజిటర్ అడిగినప్పుడు డిపాజిట్ల డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అలాగే కొంత మొత్తంలో వడ్డీ కూడా అందించాల్సి ఉంటుంది. అయితే డిపాజిట్లపై వడ్డీ చెల్లించే బ్యాంకులు రుణాలపై మాత్రం వడ్డీని సంపాదిస్తాయి. కానీ పెద్ద మొత్తంలో రుణం తీసుకున్న సంస్థలు తిరిగి వడ్డీ చెల్లించకపోయినా.. అసలు మొత్తం చెల్లించకపోయినా బ్యాంకులు నడవటం చాలా కష్టం. వీటినే మొండి బాకీలు అంటారు. ఇవి పెద్ద ఎత్తున పెరిగిపోతే సమస్త ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది.

బ్యాడ్ లోన్స్ పెరిగిపోతే బ్యాంకులు నష్టాల్లో నడుస్తాయి. అలాగే అధిక స్థాయిలో ఉన్న నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ తీవ్రతరం అవుతాయనే భయంతో వ్యాపార సంస్థలకు రుణాలను అందించడానికి బ్యాంక్ అధికారులు వెనుకాడుతారు. దేశంలో ఎన్‌పి‌ఏల స్థాయి 2016 నుంచి ఆందోళనకరంగా పెరుగుతూ వస్తోంది. 2008-09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత బ్యాంకుల్లో తీసుకునే రుణాల సంఖ్య పెరిగిపోయింది. అయితే మొండిబకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల డబ్బు ఉపయోగించి బ్యాంకింగ్ వ్యవస్థను ముందుకు తీసుకుపోతుంది ప్రభుత్వం. కానీ ఒకవైపు మొండి బకాయిలు పెరిగిపోవడం మరోవైపు 2017 నుంచి ఆర్థిక వ్యవస్థ క్షీణించడం జరుగుతోంది. దాంతో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అన్ని బ్యాంకులను బ్యాడ్ లోన్స్ నుంచి బయటకు తీసుకొస్తుంది.

బ్యాడ్ బ్యాంక్ సమస్యలను పరిష్కరిస్తుందా అంటే.. అత్యధిక మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులకు బ్యాడ్ బ్యాంక్ సహాయపడుతుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను రీక్యాపిటలైజ్ చేస్తున్నా లేదా సెక్యూరిటీ రసీదులకు హామీలు ఇచ్చినా, పన్ను చెల్లింపుదారుల జేబుకు చిల్లు పడుతుందని చెప్పుకోవచ్చు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో రుణ కార్యకలాపాలను మెరుగుపరచడం మాత్రమే ఉత్తమమైన పరిష్కారం. బ్యాడ్ బ్యాంక్ మార్కెట్లో ఆస్తులను విక్రయించలేకపోతే పన్ను చెల్లింపుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది.