Begin typing your search above and press return to search.

ప్రొటోకాల్ కు తెలియకుండా కాంగ్రెస్ ముఖ్యుల రహస్య సమావేశం.: పార్టీలో తీవ్ర చర్చ

By:  Tupaki Desk   |   11 July 2022 3:19 PM IST
ప్రొటోకాల్ కు తెలియకుండా కాంగ్రెస్ ముఖ్యుల రహస్య సమావేశం.: పార్టీలో తీవ్ర చర్చ
X
తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో సోమవారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీకి సంబంధించిన ముఖ్యులు రహస్యంగా సమావేశం కావడమే ఇందుకు కారణం. ఆదివారం ఉదయం 4 గంటలకు పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ వ్యవహారా ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్, చేరికల కమిటీ ఇన్ చార్జ్ జానారెడ్డిలు కలిసి ఓ నాయకుడిని కలిసినట్లు సమాచారం. ఈ విషయం పార్టీ నాయకుల్లో తీవ్ర చర్చనీయాంవంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్, ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవారిని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. దీంతో ఇతర పార్టీకి చెందిన ముఖ్య నేతను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై వాడీ వేడిగా చర్చ సాగుతోంది. దీంతో అదికార, ప్రతిపక్ష పార్టీల్లోనూ చలనం మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నాలు అల్రెడీ ప్రారంభించింది. గతంలో పార్టీ జాతీయ నేత రాహుల్ ను కూడా రప్పించారు ఇక్కడి నేతలు. అయితే అటు బీజేపీ కూడా జాతీయ నాయకులను తెలంగాణకు రప్పిస్తోంది. ఇక కాంగ్రెస్ ఒకడుగు ముందుకేసి చేరికలను ప్రోత్సహిస్తోంది.

ఇందులో భాగంగా 'ఘర్ వాపసీ' పేరిటి టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల మంచిర్యాల జడ్పీచైర్మన్, తదితర నేతలను పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే తాజాగా పార్టీ ముఖ్యులు ఆదివారం ఉదయం 4 గంటలకు రహస్యంగా ఎమ్మెల్యేలతో సమావేశం కావడం, ఆ తరువాత బయటికి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ తన ప్రొటోకాల్ కు తెలియకుండా గూడా బయటికి వెళ్లడం ఆసక్తిని రేపుతోంది.

సాధారణంగా మాణిక్కం ఠాగూర్ తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఆయన ఏర్పాట్లు, కార్యక్రమాలు ప్రొటోకాల్ విభాగమే చూసుకుంటుంది. ఆయన ఎవరిని కలవాలన్నా.., ఆయనను ఎవరు కలవాలన్నా ఆ విభాగం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఆదివారం ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు ప్రొటోకాల్ కు కూడా తెలియకుండా మాయమయ్యారు. అయితే విశ్వనీయవర్గాల సమాచారం ప్రకారం మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి, జానారెడ్డిలు కలిసి ఓ నాయకుడిని కలిసినట్లు సమాచారం. అంతేకాకుండా వీరితో పాటు పొలిటికల్ కన్సల్టెంట్ సునీల్ కూడా ఉండడం పార్టీలో మరింత ఉత్కంఠను రేపుతోంది.