Begin typing your search above and press return to search.

రెండో పెళ్లికి ‘సెకండ్ వైఫ్ డాట్ కామ్’.. పాకిస్తాన్ లో విమర్శలు

By:  Tupaki Desk   |   6 May 2021 5:00 AM IST
రెండో పెళ్లికి ‘సెకండ్ వైఫ్ డాట్ కామ్’.. పాకిస్తాన్ లో విమర్శలు
X
పాకిస్తాన్ అంటేనే కరుడుగట్టిన సంప్రదాయాలకు , మత చాందసవాదానికి ప్రతీకగా చెబుతుంటారు. అలాంటి దేశంలో ఇప్పుడు ‘సెకండ్ వైఫ్ డాట్ కామ్’ లాంటి వెబ్ సైట్లు, యాప్ లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్స్ ద్వారా స్త్రీ , పురుషులు మాట్లాడుకోవచ్చు. కలుసుకోవచ్చు. డేటింగ్ చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయవచ్చు. వాటిని వాడి చాలా మంది పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు.

బ్రిటన్ లో నివసించే పాకిస్తాన్ సంతతికి చెందిన ఆజాద్ చాయ్ వాలా నాలుగేళ్ల క్రితం ఇలాంటి వెబ్ సైట్ ను ప్రారంభించి దానికి సెకండ్ వైఫ్ డాట్ కామ్ అని పేరు పెట్టారు. వెబ్ సైట్ కు ఇలాంటి పేరు పెట్టిన చాయ్ వాలా బ్రిటన్ లో, పాకిస్తాన్ లో తీవ్ర విమర్వలు ఎదుర్కొన్నాడు.

పాకిస్తాన్ సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. వెబ్ సైట్ తోపాటు ఇటీవల మొబైల్ యాప్ ను కూడా తయారు చేశారు చాయ్ వాలా. బ్రిటన్, పశ్చిమ దేశాల్లో నివసిస్తున్న ముస్లిం పురుషుల కోసం ఈ వెబ్ సైట్ ను సృష్టించాను. తద్వారా వారు తమ చట్టబద్దమైన కోరికలను నెరవేర్చుకోగలరు అని ఆజాద్ తెలిపారు.

ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా స్త్రీ పురుషులు తన వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకున్నారని.. వీరిలో ఎక్కువమంది బ్రిటన్, అమెరికా, కెనడా, యూనైటెడ్ అరబ్ ఏమిరేట్స్ కు చెందిన వారేనని ఆయన తెలిపారు.

అయితే ఇది పురుషుల్లో బాహు భార్యత్వాన్ని ప్రోత్సహిస్తోందని.. ఒక్కో వ్యక్తి నాలుగు పెళ్లిళ్లు చేసుకునేలా చేస్తోందని.. సోషల్ మీడియాలో, ముఖ్యంగా మహిళల నుంచి ఈ వెబ్ సైట్ మీద విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.