Begin typing your search above and press return to search.

షాకింగ్... తెలంగాణలో రెండో కరోనా మరణం

By:  Tupaki Desk   |   30 March 2020 4:20 PM GMT
షాకింగ్... తెలంగాణలో రెండో కరోనా మరణం
X
నిజంగానే ఈ వార్త షాకింగేనని చెప్పాలి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్ ను కూడా పెను కలవరానికే గురి చేస్తోంది. భారత్ లో కరోనా కట్టడి చర్యల్లో అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందున్నదంటూ ప్రశంసలు అందుకున్న తెలంగాణలో కరోనా మరొకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికే కరోనా వైరస్ సోకడంతో ఓ వ్యక్తి చనిపోగా... తాజాగా సోమవారం ఇంకొకరు మరణించడంతో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ వార్త ఇటు తెలంగాణతో పాటు ఏపీని కూడా భారీ షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సోమవారం నాటికి 77కు చేరాయి. అయితే వీందరికీ చికిత్సలు అందించగా వారిలో 13 మంది కరోనా నుంచి పూర్తిగానే కోలుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు 13 మందిని సోమవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. మొత్తంగా తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలతో కరోనా కట్టడి యమ స్పీడుగా జరుగుతోందని - కరోనా మహమ్మారి రాష్ట్రం నుంచి పరారు కావడం ఖాయమనుకుంటున్న తరుణంలో సోమవారం కరోనా బారిన పడిన మరో తెలంగాణ వాసి మృతి చెందారన్న వార్త వినిపించడం నిజంగా భీతిగొలిపేదే.

ఇదిలా ఉంటే... ఆదివారం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో కీలక విషయాన్ని ప్రకటించారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా తోక ముడిచినట్టేనని - ఏప్రిల్ 7 నాటికి కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించనుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నోట నుంచి ఈ ప్రకటన వెలువడి 24 గంటలు గడవకుండానే తెలంగాణలో కరోనా కారణంగా మరో వ్యక్తి చనిపోయారు. దీంతో కరోనా కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో కరోనా కారణంగా రెండు మరణాలు చోటుచేసుకున్న విషయం రాష్ట్ర వాసులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోందనే చెప్పాలి. ఇదిలా ఉంటే... సోమవారం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,071కి చేరింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటిదాకా 29 మంది చనిపోగా... 100 మంది ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.