Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నికల కోడ్ సడలింపు...ఈసీ నిర్ణయం

By:  Tupaki Desk   |   18 March 2020 1:08 PM GMT
ఏపీలో ఎన్నికల కోడ్ సడలింపు...ఈసీ నిర్ణయం
X
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేయడంపై జగన్ ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది. దీంతో, ఈసీకి సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను విధించింది. ఎన్నికల వాయిదా వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డ సుప్రీం...భవిష్యత్తులో ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది. దీంతోపాటు ఏపీలో తక్షణమే ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని ఈసీకి స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని సడలించారు. దీని ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు అభ్యర్థులెవరూ ప్రచారం చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది.

ఏపీలో ఎన్నికల కోడ్ ను సవరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అభ్యర్థులెవరూ ఎన్నికల ప్రచారం చేయకూడదని - పార్టీల నేతలు - అభ్యర్థులు ప్రచారానికి దూరంగా ఉండాలని ఎస్ ఈసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ముందుగా ప్రకటించినట్లుగా ఆరు వారాల వ్యవధి లేదా ‘కరోనా’ తీవ్రత తగ్గి ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకునేవరకు తాజా ఆదేశాలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల్లో పేర్కొంది. కాగా, ఇప్పటికే అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించవచ్చని - కొత్త సంక్షేమ పథకాలను మాత్రం ప్రకటించకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం సూచనలు చేసిన సంగతి తెలిసిందే. కోడ్ ఎత్తివేయడంతో ఈసీకి ఉన్న అధికారాలు పరిమితమయ్యాయి.