Begin typing your search above and press return to search.

షేర్ ట్రేడింగ్ సాయంత్రం 5 గంటల వరకు?

By:  Tupaki Desk   |   12 Sep 2017 5:31 AM GMT
షేర్ ట్రేడింగ్ సాయంత్రం 5 గంటల వరకు?
X
షేర్ మార్కెట్‌ లో కీల‌కమైన ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలనే ప్రతిపాదనను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిశితంగా పరిశీలిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు, 5:30 గంటల వరకు, రాత్రి 7:30 గంటల వరకు స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సమయాన్ని పెంచాలన్న ప్రతిపాదనలున్నాయి. అయితే 5 గంటల వరకు పెంచాలనే ప్రతిపాదనపట్ల సెబీ మొగ్గు చూపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సెబీకి చెందిన ఓ సలహా కమిటీ దీనిపై చర్చలు జరపనుండగా, ట్రేడింగ్ సమయం పెంచడం వల్ల వ్యయప్రయాసలకు గురవుతామన్న అభిప్రాయాలను కొందరు బ్రోకర్లు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. సెబీ పెంపు దిశగానే వెళ్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 18న సెబీ బోర్డు సమావేశం జరగనుండగా, అందులో ఈ ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకే ట్రేడింగ్ జరుగుతున్నది తెలిసిందే. 2009లో మార్కెట్ ప్రారంభ సమయాన్ని ఉదయం 9:45 గంటల నుంచి 9 గంటలకు మార్చారు. 2009 అక్టోబర్‌లోనే ట్రేడింగ్ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచుకోవచ్చని స్టాక్ మార్కెట్లకు సెబీ అనుమతిచ్చింది. అయతే అప్పుడు బ్రోకర్లు వ్యతిరేకించడంతో అమల్లోకి రాలేదు. తాజాగా మళ్లీ ఈ అంశం తెరపైకి రాగా, ప్రభుత్వం - రిజర్వ్ బ్యాంక్‌ లతో సంప్రదింపులు జరిపిన తర్వాత సెబీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.