Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల‌కు ముందే కూట‌మి కుదేల‌వుతుందా?

By:  Tupaki Desk   |   30 Oct 2018 7:14 AM GMT
ఎన్నిక‌ల‌కు ముందే కూట‌మి కుదేల‌వుతుందా?
X
టీఆర్ ఎస్‌ ను ఓడించేందుకు కాంగ్రెస్ - టీజేఎస్ - సీపీఐ - టీడీపీ పార్టీలతో మ‌హాకూట‌మి ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. పొత్తులపై వ‌చ్చిన క్లారిటీ ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ర‌క‌ర‌కాల ప్ర‌చారం నేప‌థ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. పొత్తులు...సీట్ల ఖరారు..అభ్యర్థుల ఖరారు విషయంలో చర్చించారు. దీంతో కూట‌మిలో సీట్ల పంప‌కానికి శుభం కార్డు ప‌డిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే, అదేమీ లేద‌ని..ఇంకా చెప్పాలంటే...మహాకూటమి చీలిక దిశ‌గా ప‌య‌నిస్తోంద‌ని కొన్ని మీడియా సంస్థ‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సీట్ల కేటాయింపు...ఏయే స్థానాలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై చర్చలు జరపడంతో సుదీర్ఘ జాప్యం నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం దిశ‌గా ప‌లు పార్టీలు క‌దులుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

సీట్ల కేటాయింపుపై స్పష్టత ఇవ్వాలన్న యోచనలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి - తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్ రమణ - టీజేఎస్ ర‌థ‌సార‌థి కోదండరాం - సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంకటరెడ్డిలు కసరత్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా ఢిల్లీలో చంద్రబాబు-ఉత్తమ్ భేటీ అవ‌డంతో కూట‌మి సీట్ల తక‌రారు కొలిక్కి వ‌స్తుంద‌ని భావించారు. అయితే, అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. పైగా సుదీర్ఘ చర్చలు - వడపోతల తర్వాత 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిందని - ఆ జాబితాతో ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ రాత్రి ఢిల్లీకి వెళ్లిందని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో పాటుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ సిద్ధం చేసింద‌నే వార్త కూట‌మి నేత‌ల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. నవంబర్‌ 1న రాహుల్‌ నేతృత్వంలోని ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశమై తొలి జాబితాకు ఆమోదముద్ర వేయనుందని - అదే రోజు అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనున్నారు. మొదటి జాబితాలో 35 మంది పేర్లు ప్రకటించే అవకాశముందని వ‌చ్చిన వార్త‌లు...మిత్ర‌ధ‌ర్మంపై కూట‌మి పార్టీల్లో సందేహం వ్య‌క్త‌మ‌య్యేలా చేశాయి.

దీంతో, కూట‌మిలో మొద‌టినుంచి అసంతృప్తిగా ఉన్న‌ట్లుగా ప్రచారంలో ఉన్న తెలంగాణ జ‌న‌స‌మితిపై కొత్త ప్ర‌చారం సాగింది. ఆ పార్టీ కూట‌మికి గుడ్‌ బై చెప్పేయ‌నుంద‌ని - ఇందుకు నిర్ణ‌యం కూడా తీసుకుంద‌ని ఓ టీవీ ఛాన‌ల్లో బ్రేకింగ్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాల్లో టీజేఎస్ తీరు చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే, కొద్ది సేప‌టికే ఈ వార్త‌ను స‌ద‌రు చాన‌ల్ ఉప‌సంహ‌రించుకుంది. అయితే, కూట‌మిలో చీలిక నిజానిజాల విష‌యంలో స్ప‌ష్ట‌త లేకున్నా..నాలుగు పార్టీల మ‌ధ్య క‌ల‌హాల కాపురం వ‌లే సాగుతోంద‌ని కొంద‌రు అంటుంటూ...అబ్బే ఇదంతా గిట్ట‌ని వ‌ర్గాల ప్ర‌చారం అంటూ మ‌రికొంద‌రు కొట్టిపారేస్తున్నారు.