Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ - టీడీపీ సీట్ల డీల్ ఇదేనట..

By:  Tupaki Desk   |   9 Jan 2019 5:55 AM GMT
కాంగ్రెస్ - టీడీపీ సీట్ల డీల్ ఇదేనట..
X
బాబు ఢిల్లీ టూరులో పొత్తుల రాజకీయం కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. తాజాగా ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇందులో త్వరలోనే జరిగే సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తులపై ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం.. ఏపీలో కాంగ్రెస్ తో కలిసి పోటీచేయడమా.? లేక కాంగ్రెస్ ను పక్కనపెట్టి ఒంటరిగా వెళ్లడమా అన్న దానిపై బాబు-రాహుల్ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.

ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి సన్మానించిన బాబు రాహుల్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాహుల్ కు శాలువా కప్పి.. వేంకటేశ్వరుడి ఖరీదైన ప్రతిమను కానుకగా ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నారు. గతంలో బీజేపీతో అంటకాగినప్పుడు మోడీకి ఇలానే శాలువాలు కప్పి కవర్ చేసిన బాబు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ను అలాగే వాడేసుకుంటున్నారు. వాళ్ల ఇంటికి వెళ్లి మరీ అతిథి మర్యాదలు చేస్తున్నారు.

ఏపీలో అధికార టీడీపీ బలంగా ఉంది. ఇప్పుడా పార్టీకి వేరే ఎవ్వరితో పొత్తు అవసరం లేదు. కానీ జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ తో కలిసి పోటీచేయాలని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఒంటరిగా కాంగ్రెస్ గెలవదని నివేదిక రూపొందించి టీడీపీతో పొత్తు అవసరమంటూ ఏఏ స్థానాలు కావాలో నివేదిక రూపంలో ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేశారు.

తాజాగా బాబు-రాహుల్ భేటిలో రాహుల్ గాంధీ ఈ నివేదికను చంద్రబాబుకు అందజేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ 25 అసెంబ్లీ సీట్లను, ఐదు ఎంపీ సీట్లను ఏపీలో కోరుతున్నట్టు సమాచారం. మరి అన్నింటికి బాబు ఇవ్వడం అసాధ్యమనే చెప్పవచ్చు. ఏపీలో దాదాపు అంతర్థానం అయిన కాంగ్రెస్ కు అన్ని సీట్లే అత్యాశే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి చంద్రబాబు నో చెప్పే అవకాశాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీకి ఇచ్చిన సీట్లన్ని ఇస్తామని టీడీపీ ప్రతిపాదన పెట్టిందట.. అలా అయితేనే డీల్ ఓకే అని లేదంటే ఒప్పుకోమని టీడీపీ అధినేత నుంచి కాంగ్రెస్ కు వర్తమానం అందినట్టు సమాచారం. మరి కలిసి పోటీచేయాలనుకుంటున్న కాంగ్రెస్-టీడీపీలు ఎన్ని సీట్లను పంచుకుంటాయన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ దీనికి ఒప్పుకుంటుందా లేదా చూడాలి మరి.