Begin typing your search above and press return to search.

పుణ్యక్షేత్రంలో అస్థికల వేట.. ఎక్కడ.. ఎందుకు!

By:  Tupaki Desk   |   16 Sep 2020 12:30 PM GMT
పుణ్యక్షేత్రంలో అస్థికల వేట.. ఎక్కడ.. ఎందుకు!
X
ఉత్తరాఖండ్‌లో ఏడేళ్ల కిందట సంభవించిన మహా ప్రళయంలో అయిదువేలమంది జలసమాధి అయిన విషయం తెలిసిందే. అప్పట్లో 10 రోజుల పాటు ఏకధాటిగా భారీవర్షాలు కురవడంతో రుద్రప్రయాగ వంటి జిల్లాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అప్పట్లో తీర్థయాత్రలకు వెళ్లిన ఎందరో గల్లంతయ్యారు. కేదార్‌నాథ్, చార్‌ధామ్ యాత్రలకు వెళ్లిన వాళ్లలో దాదాపు 5,700 మంది మరణించారు. వారిలో కొందరిని సైనికులు కాపాడారు. అక్కడ అప్పుడు ఆ పర్వతాల్లో మరణించిన వాళ్ల ఆస్థిపంజరాల కోసం ఉత్తరాఖండ్​ ప్రభుత్వం ప్రస్తుతం అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 10 బృందాలను నియమించారు.

రుద్రప్రయాగ, కేదార్‌నాథ్ పరిసరాల్లోని పర్వత పంక్తుల్లో వారు అస్తిపంజరాలను వెతుకుతున్నారు. ఉత్తరాఖండ్ పోలీసులు, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం సిబ్బంది ఈ స్పెషల్​టీమ్​లో ఉన్నారు. వరదల్లో గల్లంతైన వారి సంఖ్యలో అనుమానాలు వ్యక్తమౌతున్నాయని, వాటిని నిర్ధారించాల్సి ఉందని గర్వాల్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అభినవ్ కుమార్ తెలిపారు. అస్తిపంజరాలను గుర్తించి, డీఎన్ఏ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. కేదార్‌నాథ్ సమీపంలోని వాసుకీతల్, చోరాబాడీ, త్రియుగీ నారాయణ్, గరుడ్ చట్టీ, కాళీమఠ్, చౌమాసీ, ఖామ్, జంగల్ చట్టీ, రామ్‌బాడా, కేదార్‌నాథ్ బేస్ క్యాంప్, భైరవ్‌నాథ్ ఆలయం, గౌరీకుండ్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా మానవ అస్తిపంజరాల కోసం గాలింపు చర్యలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 600 అస్థిపంజరాలు దొరికాయని పోలీసులు చెప్పారు.