Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో కాళ్లకు పనిచెప్పిన హాలీవుడ్ స్టార్ హీరో

By:  Tupaki Desk   |   2 March 2022 10:10 AM GMT
ఉక్రెయిన్ లో కాళ్లకు పనిచెప్పిన హాలీవుడ్ స్టార్ హీరో
X
సాధారణంగా సినిమాల్లో హీరోలు కొడుతుంటే.. విలన్లు పారిపోతుంటారు. దీనినే మన భాషలో చెప్పాలంటే కాళ్లకు పనిచెప్పడం అంటారు. అయితే, యుద్ధ సంక్షుభిత పరిస్థితులతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్ లో ఓ హీరో నే కాళ్లకు పనిచెప్పాడు. అతడు టాలీవుడ్, బాలీవుడ్ హీరో కాదు బాలీవుడ్ హీరో. ఇతడు చిత్రంగా ఉక్రెయిన్ లో ఇరుక్కుపోయాడు. తనకేం షూటింగ్ లు లేకపోయినా, రష్యా యుద్ధోన్మాదాన్ని లఘు చిత్రంగా తీసేందుకు వెళ్లి చిక్కుకున్నాడు. వాస్తవానికి ఉక్రెయిన్ సంక్షోభం ఇవాళ్టికి ఏడో రోజుకు చేరింది.

ఆరు రోజుల్లో 6 వేల మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. మరోవైపు ఇరు దేశాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. భారతీయ విద్యార్థులతో పాటు లక్షలాది మంది ఉక్రెనియన్లు స్వదేశాన్ని వీడి వెళ్లారు. ఇప్పటికే 6 లక్షల మంది పొరుగు దేశాలకు వెళ్లిపోయినట్లు అంచనా. ఎక్కువగా కూడా కాలినడకనే దేశం నుంచి పారిపోవాల్సి వస్తోంది. హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు సీన్‌ పెన్‌ కూ ఇలాంటి పరిస్థితే వచ్చింది.

ఈయన డాక్యుమెంటరీ చిత్రీకరణకు ఇటీవల ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెళ్లారు. యుద్ధం మొదలైన రోజు గత గురువారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మీడియా సమావేశానికి కూడా పెన్ హాజరయ్యారు. సంక్షోభ పరిస్థితులపై కొన్ని వీడియోలు రికార్డ్‌ చేశారు.

అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. పెన్ ఉక్రెయిన్‌ నుంచి కాలినడక వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. కారు వదిలేసి.. కాలినడకన పెన్ చెబుతున్నదాని ప్రకారం.. అతడు కొందరితో కలిసిన డాక్యుమెంటరీ చిత్రీకరణకు వెళ్లాడు. సంక్షోభం ముదరడంతో తక్షణమే అక్కడినుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

దీంతో భుజానికి బ్యాగు వేసుకుని, చేతిలో ట్రాలీ బ్యాగ్ పట్టుకుని హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను షేర్‌ చేశారు. ‘‘మా కారును రోడ్డు పక్కన వదిలేసి నేను, నా ఇద్దరు కొలీగ్స్‌ మైళ్ల దూరం నడుచుకుంటూ పాలిష్‌ (పోలాండ్‌) బోర్డర్‌కు చేరుకున్నాం. ఈ ఫొటోలో కన్పిస్తోన్న అన్ని కార్లలో మహిళలు, చిన్నారులే ఉన్నారు. వారితో ఎలాంటి లగేజీ లేదు. కేవలం కారు మాత్రమే వారి వెంట ఉన్న ఏకైక ఆస్తి’’ అని రాసుకొచ్చారు. కారును వదిలేసి నడుచుకుంటూ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం పెన్ వెల్లడించలేదు. కాగా.. ఆయన ఉక్రెయిన్‌ నుంచి సురక్షితంగా బయటపడినట్లు లాస్‌ ఏంజిల్స్‌లోని పెన్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

అయితే, ఎక్కడ ఉన్నారు.. ఎందుకు ఉక్రెయిన్‌ను వీడారు అనే వివరాలు చెప్పేందుకు పెన్‌ సిబ్బంది నిరాకరించారు. ఆస్కార్ అందుకున్న నటుడు...నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన సీన్‌ పెన్‌.. మిస్టిక్ రివర్‌, మిల్క్‌ సినిమాల్లో నటనకు గానూ ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు.

ప్రకృతి విపత్తుల సమయంలోనూ ప్రజలను ఆదుకునేందుకు ముందుంటారు. 2010లో హైతీ భూకంపం, 2012 పాకిస్థాన్‌లో వరదల సమయంలోనూ బాధితులకు సాయం అందించారు. 2016లో మెక్సికన్‌ డ్రగ్‌ డీలర్‌ ఎల్‌ చాపోను రహస్యంగా ఇంటర్వ్యూ చేసి పెన్‌ వార్తల్లో నిలిచారు.