Begin typing your search above and press return to search.

తొలిసారి కృష్ణమ్మ గర్భంలో భూప్రకంపనలు.. కిందామీదా పడుతున్న శాస్త్రవేత్తలు

By:  Tupaki Desk   |   27 July 2021 3:58 AM GMT
తొలిసారి కృష్ణమ్మ గర్భంలో భూప్రకంపనలు.. కిందామీదా పడుతున్న శాస్త్రవేత్తలు
X
ఎప్పుడూ లేని రీతిలో నల్లమలలోని కృష్ణా నదిలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో నల్లమల ప్రాంతంలోని పలు ఊర్లు ప్రభావానికి గురయ్యాయి. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఉదంతం అక్కడి వారిలో ఆందోళనకు గురి చేసింది. భూప్రకంపనల తీవ్రత 3.7గా గుర్తించారు. భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్రీశైల జలశయానికి పడమర వైపు 44 కి.మీ. దూరంలో.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు తూర్పున 18 కి.మీ. దూరంలో కృష్ణా నదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఏడు కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లుగా చెబుతున్నారు.

భూప్రకంపనలు కొన్నిచోట్ల నాలుగు సెకన్లు.. మరికొన్నిచోట్ల మూడు సెకన్లు మాత్రమే చోటు చేసుకున్నాయి. దీనికే నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట పట్టణం.. కొల్లాపూర్.. లింగాల.. అమ్రాబాద్.. పదర.. ఉప్పునుంతల.. బల్మూరు మండలాలతో పాటు శ్రీశైలం సమీప గ్రామాలు.. గిరిజన గూడెలు కూడా భూప్రకంపన ప్రభావానికి లోనయ్యాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా భూప్రకంపనలు చోటు చేసుకోవటం.. ఇళ్లల్లో సామాన్లు కిందపడిపోవటంతో ప్రజలు ఆందోళనకు గురై ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావటంతో వారిలో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూప్రకంపనల నేపథ్యంలో శ్రీశైల జలాశయం వద్ద పరిస్థితులపై అధికారులు ఆరా తీశారు. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కాకుంటే.. శ్రీశైలం ఆనకట్టకు పెను ముప్పు తప్పినట్లైందని చెబుతున్నారు. ఇక్కడ ఆనకట్ట కట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చోటు చేసుకోలేదని.. ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూప్రకంపనలకు కారణాలు ఏమిటన్న అంశంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. సోమవారం మొత్తం మీదా ఒక్కసారి మాత్రమే భూప్రకంపనలు రావటంతో.. ఎందుకిలా? జరిగిందన్న విషయాన్ని తేల్చటానికి శాస్త్రవేత్తలు కిందా మీదా పడుతున్నారు.

చిన్నదే కావటంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే.. నల్లమల పరిసర ప్రాంతాల ప్రజలు దీనిపై ఆందోళన చెందొద్దని చెబుతున్నా.. వారిలో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం ఆనకట్ట దక్షిణం వైపు గతంలో ఒకట్రెండుసార్లు ప్రకంపనలు వచ్చాయని.. అయితే అవి చాలా చిన్నవిగా శాస్త్రవేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద వస్తోంది. ఇప్పుడక్కడ 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.

నీటి నిల్వ పెరుగుతోంది. సాధారణంగా నీటి ప్రవాహాలు ఒక్కసారి మొదలైన తర్వాత రాతి పొరల్లోని పగళ్లలోకి నీటి వెళ్లిన నేపథ్యంలో అక్కడ సర్దుబాటుకు భూమి స్వల్పంగా కంపిస్తుంటుంది. అయితే.. తాజా ప్రకంపనలుఆ కోవకు చెందినవా? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. రాతి పగుళ్లలోకి నీరు వెళ్లి సర్దుబాటు ప్రక్రియ అయితే మాత్రం ఎక్కువ సార్లు భూమి కంపిస్తుందని.. తాజా ఉదంతంలో ఒక్కసారి మాత్రమే భూప్రకంపనలు రావటంతో.. అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా కృష్ణమ్మ గర్భంలోపల చోటు చేసుకున్న ఈ ప్రకంపనలు కొత్త ఆందోళనకు తెర తీశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.