Begin typing your search above and press return to search.

ఏపీలో మొదలైన స్కూళ్లు ... రెస్పాన్స్ మాత్రం అంతంతే !

By:  Tupaki Desk   |   2 Nov 2020 6:20 PM IST
ఏపీలో మొదలైన స్కూళ్లు ... రెస్పాన్స్ మాత్రం అంతంతే !
X
ఆంధ్రప్ర‌దేశ్‌ లో ఈ రోజు నుండి మళ్లీ స్కూళ్లు తెరుచుకున్నాయి. మార్చి లో కరోనా విజృంభణతో ప్రజల ప్రాణాలని రక్షించుకోవడం కోసం లాక్‌ డౌన్ విధించారు. ఆ లాక్ డౌన్ లో మూత‌ప‌డ్డ స్కూళ్లు .. ఇవాళ రిఓపెన్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేవ‌లం 9,10, త‌ర‌గ‌తుల‌కు నేటి నుంచి స్కూళ్లు ఓపెన్ చేయడానికి అనుమ‌తి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల్లో స్కూళ్లలను తెరిచారు. కరోనా నిబంధ‌న‌లు పాటిస్తూ విద్యార్థులు పాఠ‌శాల‌ల‌కు హాజ‌రుకావాల్సి ఉంటుంది. ప్ర‌తి క్లాసు మ‌ధ్య శానిటైజ్ చేసుకునేందుకు విద్యార్థుల‌కు 15 నిమిషాల బ్రేక్ ఇస్తున్నారు.

అయితే కోవిడ్ నేప‌థ్యంలో ద‌శ‌ల‌వారీగా స్కూళ్ల‌ను తెరిచేందుకు ఏపీ స‌ర్కార్ అనుమ‌తి ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ను ఇటీవ‌లే రిలీజ్ చేసింది. మూడు ద‌శ‌ల్లో స్కూళ్ల‌లో త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి 9, 10, 11, 12 త‌ర‌గ‌తుల‌కు రోజు త‌ప్పించి రోజు స‌గం దినం క్లాసుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇక 6,7,8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కూడా హాఫ్ డే స్కూళ్ల‌ను స్టార్ట్ చేస్తున్నారు. న‌వంబ‌ర్ 23వ తేదీ నుంచి రోజు విడిచి రోజు ఈ క్లాసులు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి అయిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు డిసెంబ‌ర్ 14వ తేదీ నుంచి ప్ర‌త్యామ్నాయ దినాల్లో స్కూళ్ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. స్కూళ్లు తెరవడంతో.. కరోనా నివారణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్ధులు, తల్లిదండ్రులు జాగ్రతలు తీసుకోవాలని.. సోషల్‌ డిస్టెన్స్‌, శానిటైజర్‌, మాస్కూలు తప్పనిసరని కేంద్రం కూడా హెచ్చరించింది. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో తమ పిల్లలను బడికి పంపించలేమంటూ చాలా మంది తల్లిదండ్రులు తేల్చి చెబుతున్నారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు.. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడలేమంటున్నారు..

నిజానికి ఇంకా రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఇంకా తగ్గిపోలేదు. ఏపీలో ఇప్పటికే కరోనా కేసులు 8 లక్షలు దాటాయి. ఇక సగం మందికి అనధికారికంగా వచ్చిపోయిందంటున్నారు. ఇప్పటికే చలి కూడా బాగా పెరిగింది. దీంతో వైరస్‌ విజృంభించేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏమాత్రం లైట్‌ తీసుకున్న మూల్యం చెల్లించుకోకతప్పదు. ఈ పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దంటున్నారు డాక్టర్లు. మొదట్లో ఎలాంటి జాగ్రత్తలు వహించామో.. అదే జాగ్రత్తలు వహించాలని లేదంటే మళ్లీ ముప్పు తప్పదని హెచ్చరికలు అందుతున్నాయి. ఐరోపా దేశాల్లో సెకండ్ వేవ్ వణికిస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని స్కూళ్లు ఓపెన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే , తొలిరోజు పెద్దగా రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది . కరోనా ఇంకా పూర్తిగా పోకపోవడం , వ్యాక్సిన్ కూడా ఇంకా మార్కెట్ లోకి రాకపోవడంతో కొందరు తల్లిదండ్రులు పిల్లలల్ని స్కూళ్లకి పంపడానికి ఇష్టపడటం లేదు. 2020-21 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి కానుందని ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కారణంగా కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసేందుకు సిలబస్‌ రూపకల్పన చేస్తున్నారు. స్కూళ్లకు 180 రోజుల పని దినాలు ఉండనున్నాయి.