Begin typing your search above and press return to search.

ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో స్కూళ్లు మూసేశారు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు?

By:  Tupaki Desk   |   21 March 2021 3:30 PM GMT
ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో స్కూళ్లు మూసేశారు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు?
X
పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వాలు పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే తెరిచిన స్కూళ్లు.. హాస్టల్స్.. విద్యాలయాలు.. లాంటి వాటి విషయంలో మళ్లీ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్కూళ్ల విషయంలో తాము నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పటం తెలిసిందే. మన దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంటే.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల సంగతి చూస్తే.. మన కంటే వారు మరింత ముందుగా ఉన్నారని చెప్పాలి.

గుజరాత్ లో 8 మున్సిపాలిటీల్లో ఏప్రిల్ పది వరకు స్కూళ్లు మూసేయాలని నిర్ణయించారు. పంజాబ్ లో వైద్య.. నర్సింగ్ కాలేజీలు మినహా మిగిలిన అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకు మూసివేస్తూ సీఎం అమరీందర్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అందరి స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించారు. ఈ నెల 31 వరకు మూసి ఉంచాలని నిర్ణయించారు.

ఏపీకి పక్కనే ఉన్న తమిళనాడులోనూ 9..10..11 (ప్లస్ వన్) తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతుల్ని నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఇలా.. ప్రతి రాష్ట్రం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో ఈ అంశంపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెబుతుంటే.. తెలంగాణలో మాత్రం మూడు నాలుగు రోజుల్లోనే కీలక నిర్ణయం వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది.