Begin typing your search above and press return to search.

పారాహుషార్.. టిక్ టాక్ ప్రో అని లింకే వస్తే డేంజరే

By:  Tupaki Desk   |   8 July 2020 7:30 AM GMT
పారాహుషార్.. టిక్ టాక్ ప్రో అని లింకే వస్తే డేంజరే
X
ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ.. రోజుకో కొత్త ఎత్తుతో జనాల్ని కొల్లగొట్టేలా ప్లాన్ చేస్తుంటారు సైబర్ మోసగాళ్లు. ట్రెండ్ ను పక్కాగా ఫాలో అవుతూ సరికొత్త ఐడియాలతో గాలం వేస్తుంటారు. అలా వారి గాలానికి చిక్కినోళ్లంతా భారీగా నష్టపోతుంటారు. తాజాగా అలాంటి కొత్త తరహా మోసానికి తెర తీశారు సైబర్ నేరస్తులు. ఈ మధ్య వరకూ దేశంలో మస్తు పాపులర్ గా మారిన ఆరోగ్య సేతు.. పీఎం కేర్స్ పేరుతో నకిలీ రిక్వెస్టులు చేసిన మొబైల్ ఫోన్లో ఉండే బ్యాంకు ఖాతాల్ని ఖాళీ చేసినోళ్లు ఇప్పుడు రూటు మార్చారు.

టిక్ టాక్ యూజర్లుగా పన్నెండు కోట్ల మంది ఉండటంతో.. వారిని టిక్ టాక్ ప్రో పేరుతో ట్రాప్ చేసే ఎత్తుగడ వేస్తున్నారు. టిక్ టాక్ రూపు మారిపోయిందని.. కొత్త తరహా యాప్ కోసం తాము పంపిన లింక్ క్లిక్ చేస్తే సరిపోతుందని తెలివిగా ఉచ్చు విసురుతున్నారు. టిక్ టాక్ మీద ఉన్న మోజుతో.. ఆ లింకును క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులుగా చెబుతున్నారు.

ఈ లింకులో వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని దొంగలించే మాల్ వేరు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీన్ని క్లిక్ చేసిన వెంటనేకంప్యూటర్లు.. స్మార్ట్ ఫోన్లలోచొరబడుతుందని చెబుతున్నారు. ఆ వెంటనే సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లచేతిలో పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. క్షణాల్లో బ్యాంకు ఖాతాలోని మొత్తాల్ని ఖాళీ చేసే సామర్థ్యం వీరికి ఉన్నట్లు చెబుతున్నారు.

రాత్రికి రాత్రి టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో.. దాన్ని అదే పనిగా వాడే వారంతా షాక్ లో ఉన్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా తీసుకొనిలింకుల్ని పంపుతున్నారు. టిక్ టాక్ ప్రో పేరుతో లింకు రావటంతో.. ఉత్సాహంగా దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే మొదటికే మోసం ఖాయమంటున్నారు.

ఇప్పటికే ఈ మోసానికి బలైన చాలామంది బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్ టాక్ ప్రో అన్న లింకు వస్తే అలెర్టు కావటమే కాదు.. దాన్ని వెంటనే డిలీట్ చేయటానికి మించిన మంచి పని మరొకటి ఉందంటున్నారు. అంతేకాదు.. ఈ టిక్ టాక్ ప్రో లింకును క్లిక్ చేసినోళ్లు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇతర కీలక స్థానాల్లో ఉన్న వారుంటే.. వారికి సంబంధించిన రహస్య సమాచారం మొత్తం బదిలీ అయిపోతుందని.. అది మరింత అపాయకరంగా పేర్కొంటున్నారు. ఎందుకైనా మంచిది టిక్ టాక్ ప్రో అన్న పేరుతో లింకు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.