Begin typing your search above and press return to search.

మీ ఫోన్ లో ఎస్ బీఐ యాప్ ఉందా? ఈ తప్పు మాత్రం చేయొద్దు

By:  Tupaki Desk   |   8 Sep 2021 3:58 AM GMT
మీ ఫోన్ లో ఎస్ బీఐ యాప్ ఉందా? ఈ తప్పు మాత్రం చేయొద్దు
X
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) లో మీకు అకౌంట్ ఉందా? ఒకవేళ ఉంటే.. మీరు దీన్ని తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉంది. బ్యాంకు అకౌంట్ ఉన్నంతనే.. దానికి సంబంధించిన మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని దాన్ని వినియోగించటం ఇవాల్టి రోజున సర్వసాధారణం. చదువున్నా.. లేకున్నా.. మొబైల్ యాప్ ల మీద కనీస అవగాహన ఉన్న వారంతా డౌన్ లోడ్ చేసేయటం ఈ మధ్యన ఎక్కువైంది. దీంతో సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. మాయమాటలు చెప్పి.. సంబంధం లేని యాప్ లను డౌన్ లోడ్ చేయించి.. వాటి సాయంతో ఎస్ బీఐ ఖాతాలోని డబ్బుల్ని ఖాళీ చేసే మాయగాళ్లు ఈ మధ్యన ఎక్కువ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఎస్ బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. తమ బ్యాంకు యాప్ ను మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకొని.. వాడే వారు ఎట్టి పరిస్థితుల్లో తాము పేర్కొన్న నాలుగు యాప్ లను ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ నాలుగుయాప్ లతో ఖాతాలోని డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఇంతకీ ఆ నాలుగు యాప్ లు ఏవంటే..

1. ఎనీ డెస్క్
2. క్విక్ సపోర్ట్
3. టీమ్ వ్యూయర్
4. మింగిల్ వ్యూ

కొందరు మోసగాళ్లు ఎస్ బీఐ నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ.. ఈ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని సలహా ఇచ్చి.. ఒప్పించే ప్రయత్నం చేస్తారని పేర్కొంది. అలాంటి వారి మాటల్ని విని యాప్ లను డౌన్ లోడ్ చేసుకున్న 150 మంది ఎస్ బీఐ వినియోగదారులు మొత్తంగా రూ.70 లక్షలు నష్టపోయినట్లు ఎస్ బీఐ పేర్కొంది. ఈ మోసాలు తమ వరకు రావటంతో వెంటనే అలెర్టు అయిన ఎస్ బీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాలుగు యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది.

తెలియని నెంబర్ల నుంచి క్యూఆర్ కోడ్ వచ్చినా.. యూపీఐ కలెక్టు రిక్వెస్టు వచ్చినా వాటిని వెంటనే తిరస్కరించాలని పేర్కొంది. ఎస్ బీఐ పేరుతో పలు నకిలీ వెబ్ సైట్లు ఉన్నాయని.. హెల్ప్ లైన్.. కస్టమర్ కేర్ నెంబర్లు వెతికేటప్పుడు అలాంటి వెబ్ సైట్ల జోలికి వెళ్లకూడదని వార్నింగ్ వచ్చింది. ఏ సమస్య పరిష్కారానికైనా తమ అధికారిక వెబ్ సైట్ మాత్రమే వాడాలని.. వేరే దేన్ని వాడొద్దని స్పష్టం చేసింది. ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే.. 1800111109 లేదంటే 9449112211, 08026599990 కస్టమర్ కేర్ నెంబర్లలో సంప్రదించొచ్చని పేర్కొంది. అంతేకాదు.. 155620 నెంబరును ఉపయోగించి.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో కూడా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది. సో.. ఎస్ బీఐ ఖాతాదారులు పారాహుషార్.