Begin typing your search above and press return to search.

నిర్భయ దోషి అంత అమాయకుడన్నా..సుప్రీం నో చెప్పేసింది

By:  Tupaki Desk   |   18 Dec 2019 4:00 PM IST
నిర్భయ దోషి అంత అమాయకుడన్నా..సుప్రీం నో చెప్పేసింది
X
ఎవరి ఫ్రొఫెషన్లు వారివి. కానీ.. దోషులను నిర్దోషులుగా చిత్రీకరిస్తూ వాదించే లాయర్ల వాదలు విన్నప్పుడు చాలామందికి ఒళ్లు మండిపోతుంటుంది. ఘోరమైన నేరాలు చేసినప్పుడు నిందితుల తరఫున వాదించొద్దన్న భావోద్వేగ నిర్ణయం ఎంత తప్పు అవుతుందో.. దారుణమైన నేరం చేసినోడ్ని వెనకేసుకొస్తూ.. అతగాడెంత సుద్దపూసో తెలుసా? నోట్లో వేలు పెడితే కొరకను కూడా కొరకలేడన్నట్లుగా వాదించే వాదనలు విన్నప్పుడు కింద నుంచి పై వరకూ మంట పడుతుంటుంది.

అనాగరికంగా.. మనిషి అన్నోడు చేయలేని రీతిలో నిర్భయను అత్యంత దారుణంగా.. పైశాచికంగా సామూహిక అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ ఇప్పటికే దోషిగా నిరూపితమై.. ఉరిశిక్షను ఎదుర్కొంటున్నాడు. తాజాగా తను సుప్రీంకు రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశాడు. దోషి కోరినట్లుగా తామిచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.

రివ్యూ పిటిషన్ ను సుప్రీంలో దాఖలు చేసిన నేపథ్యంలో అక్షయ్ సింగ్ తరఫున లాయర్లు వాదించిన వాదన విన్నప్పుడు మనిషి రూపంలో ఉన్న కామపిశాచాల్ని కాపాడేందుకు ఇంత మేధస్సు వినియోగించాలా? అన్న సందేహం కలుగక మానదు. అక్షయ్ చాలా పేద వ్యక్తి అని.. అమాయకుడని.. తప్పుడు ఆధారాలతో అతన్ని ఈ కేసులో ఇరికించినట్లుగా లాయర్ వాదించాు.

నిర్భయ మరణవాంగ్మూలంలోనూ అనుమానాలు ఉన్నాయని.. చనిపోయే ముందు నిర్భయ ఇచ్చిన వాంగ్మూలంలో అక్షయ్ పేరు ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశాడు. రాత్రివేళ బస్సు ఎక్కినప్పుడు.. తనను దారుణంగా అత్యాచారం చేసిన వ్యక్తుల పేర్లు.. చిరునామాలు.. వారి బ్యాక్ గ్రౌండ్ గురించి బాధితురాలు చెబుతుందనటానికి మించిన దరిద్రం ఇంకేం ఉంటుంది? అయినప్పటికీ సదరు లాయరు వారు ఈ తీరులో వాదించేయటం గమనార్హం.

పుట్టుకతోనే రేపిస్టులు కారని.. సమాజమే వారిని అలా మారుస్తుందన్న లాయరుగారి వాదన విన్నప్పుడు.. మరి సదరు మహాశయుడు లాయర్ ఎందుకు అయినట్లు? రేపిస్టు ఎందుకు కాదన్నట్లు? వీధుల్లో తిరిగే కుక్కల్ని పిచ్చి కుక్కలు ఉండవు.. ఒకట్రెండే ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి? చుట్టూ ఉన్న సమాజం.. వాతావరణం.. కుక్క కర్మ ఫలితంగా మాత్రమే పిచ్చిగా అయి ఉంటుందా? అలా అని వదిలేస్తే.. అది కనిపించినోడినల్లా కరవకుండా ఉండదు కదా? దరిద్రపుగొట్టు వాదనలు వినిపించి దోషిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ సదరు లాయర్ వాదనను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా అతడి రివ్యూ పిటీషన్ ను కొట్టేసింది.

ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నట్లు.. కొన్ని నేరాలు మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోతాయి. అలాంటిది ఇది కూడా. ఈ కేసులో దోషి సానుభూతి పొందే అర్హత కూడా లేదు.. ఇలాంటి రాక్షసుడిని పుట్టించినందుకు బాధితురాలిని కాపాడుకోలేకపోయినందుకు ఆ దేవుడు కూడా సిగ్గుపడతాడన్న ఆవేదనలో అర్థం ఉందని చెప్పక తప్పదు.