Begin typing your search above and press return to search.

మంత్రులు ఏం చేస్తున్నారు? సీటు ద‌క్కినా.. అధికారం ఏమైంది?

By:  Tupaki Desk   |   23 Jan 2022 6:00 AM IST
మంత్రులు ఏం చేస్తున్నారు?  సీటు ద‌క్కినా.. అధికారం ఏమైంది?
X
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో ఏకంగా ఐదుగురు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేతల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన వైసీపీ.. కొలువుదీరిన త‌ర్వాత‌.. ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సామాజిక ఇంజ‌నీరింగ్ అనే జ‌పం చేశారు. ఈ క్ర‌మంలోనే త‌న మంత్రివ‌ర్గంలో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు స్థానం క‌ల్పించారు. ముఖ్యంగా జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్రం రెడ్డి రాజ్యం అవుతుందేమో.. అన్న సందేహాల‌కు జ‌గ‌న్ చెక్ పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంల‌తో పాటు.. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ఆయ‌న ప్రాధాన్యం క‌ల్పించారు.

ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ ఇవ్వ‌ని విధంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి ఐదు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. రాష్ట్ర హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌(గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు), మ‌హిళా సంక్షేమ మంత్రి తానేటి వ‌నిత‌(ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరు), ఎక్స‌యిజ్ శాఖ‌మంత్రి నారాయ‌ణస్వామి(చిత్తూరు జిల్లా గంగాధ‌ర‌నెల్లూరు), సామాజిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌(తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురం), విద్యాశాఖ‌మంత్రి ఆదిమూల‌పు సురేష్(ప్ర‌కాశం జిల్లా ఎర్ర‌గొండ‌పాలెం)ల‌కు సీఎం జ‌గ‌న్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఇప్ప‌టికి రెండున్న‌రేళ్లు వీరు మంత్రులుగా ప‌ద‌వీ కాలం పూర్తి చేసుకున్నారు.

అయితే.. ఏ శాఖ‌లో అయినా..వీరు త‌మ ముద్ర వేసుకున్నారా? త‌మ‌కంటూ.. ఆయా శాఖ‌ల్లో ఒక ప్ర‌త్యేక పేజీని రూపొందించుకున్నారా? అంటే లేద‌నే చెబుతున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం ఏంటి? అంటే.. ప‌ద‌వులు అయితే.. ద‌క్కాయి కానీ.. అధికారాలు మాత్రం వీరికి ఇవ్వ‌క‌పోవ‌డ‌మేన‌ని అంటున్నారు. ఏం చేయాల‌న్నా.. వీరు.. స్వ‌తంత్రంగా నిర్ణ‌యం తీసుకునే వెసులుబాటు లేదు. అన్నీ పెద్ద‌ల‌తో మాట్లాడిన త‌ర్వాత‌.. వారి అభీష్టం మేరకే నిర్ణ‌యాలు తీసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంతేకాదు.. త‌మ శాఖ‌ల‌కు వ‌చ్చే ఫైళ్ల‌ను కూడా క్లియ‌ర్ చేసే ముందు.. సంబంధిత విష‌యం పెద్ద‌యితే.. పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లాల్సి వ‌స్తోంద‌ట‌.

దీంతో కీల‌క‌మైన శాఖ‌లు చేతిలో ఉన్నా.. మంత్రులుగా ఈ ఐదుగురు ఎస్సీ సామాజిక వ‌ర్గం నేత‌ల‌కు అవ‌కాశం లేక‌పోవ‌డంతో .. శాఖ‌ల‌పై ప‌ట్టుకూడా ద‌క్కించుకోలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా హోం మంత్రి సుచ‌రిత‌కు ముప్పేటక‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. ఎస్సీ మంత్రి అయిన ఆమె.. ఎస్సీల‌పై జ‌రుగుతున్న‌దాడుల‌ను అడ్డుకునే శ‌క్తి కూడా లేదా? అని ద‌ళిత సంఘాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, వ‌నిత ప‌రిస్థితి పైన ప‌టారం.. అన్న‌ట్టుగానేఉంది. పినిపే విశ్వ‌రూప్ ఇంటి గ‌డ‌ప దాట‌డం లేదు. వ‌చ్చినా ప్ర‌యోజ‌నం లేద‌ని , ఆయ‌న ముందుగానే నిర్ణ‌యించుకున్నారు. మంత్రి నారాయ‌ణ స్వామి ప‌ద‌వి ఎప్పుడు పోతుందో అనేది గులుతో అల్లాడుతున్నారు. ఇలా.. ఎస్సీ మంత్రులు.. నామ్‌కే వాస్తే.. అన్న‌ట్టుగా ఉన్నార‌ని అంటున్నారు ద‌ళిత సంఘాల నేత‌లు.