Begin typing your search above and press return to search.

వారితో పోలిస్తే..ఎస్బీఐ చీఫ్ కు జీతం లేనట్టే!

By:  Tupaki Desk   |   26 Jun 2017 4:25 AM GMT
వారితో పోలిస్తే..ఎస్బీఐ చీఫ్ కు జీతం లేనట్టే!
X
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... జాతీయ బ్యాంకుల్లో రారాజు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకే కాదండోయ్‌... ప్ర‌పంచంలోని 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఇదీ ఒక‌టి. దేశంలో ఎన్ని ప్రైవేట్ బ్యాంకులున్నా... స్టేట్ బ్యాంకుకు సాటి రావు. ఎందుకంటే ఆ బ్యాంకుకు అంత నెట్ వ‌ర్క్ ఉంది... ఏ బ్యాంకుకు లేనంత మంది క‌స్ట‌మ‌ర్లున్నారు. మ‌రి ఇంత పెద్ద బ్యాంకుకు చీఫ్‌ గా ఉన్న ఉన్న‌తాధికారి వేత‌నం ఎంత ఉండాలి? దేశంలోని అన్ని బ్యాంకుల చీఫ్‌ ల కంటే కూడా అధికంగానే ఉండాలి. మ‌రి అలా ఉందా? అంటే... ఎంత‌మాత్రం లేద‌నే చెప్పాలి. అంతేనా... ఎస్బీఐ కంటే కూడా చాలా చిన్న బ్యాంకులుగా ఉన్న ప్రైవేట్ బ్యాంకుల చీఫ్‌ ల‌కు అందుతున్న వేత‌నంతో పోలిస్తే... స్టేట్ బ్యాంకు చీఫ్‌ కు అందుతున్న‌ది అస‌లు వేత‌నం కిందే లెక్క కాదని చెప్పేయొచ్చు.

ఇదంతా నిజ‌మా? అంటే... ఆయా బ్యాంకులకు అధిప‌తులుగా ఉన్న వారి వేత‌నాలు ఓ సారి ప‌రిశీలిస్తే ఇది నిజ‌మే సుమా అని ఒప్పుకోక త‌ప్ప‌దు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ గా ఉన్న అరుంధ‌తీ భ‌ట్టాచార్య‌... ఆ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక బ్యాంకు ప‌నితీరు అమాంతం పెరిగిపోయింది. చాన్నాళ్ల నుంచి అసోసియేటెడ్ బ్యాంకుల‌ను దానిలో విలీనం చేయాల‌ని ఎంత‌మంది య‌త్నించినా కానిది... భ‌ట్టాచార్య వ‌చ్చిన త‌ర్వాత ఆ కార్య‌క్ర‌మం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. మ‌రి ఆమెకు ఏడాదికి అందుతున్న వేత‌నం ఎంతంటే కేవ‌లం... రూ.28.96 ల‌క్ష‌లు. అంటే నెల‌కు రెండున్న‌ర ల‌క్ష‌లు కూడా కాదు. స‌ర్కారీ కొలువుల్లో ఉన్న ఇత‌ర శాఖ‌ల ఉద్యోగుల‌తో పోలిస్తే... ఫ‌ర‌వా లేద‌నిపించినా... స్టేట్ బ్యాంకు కంటే చిన్న బ్యాంకులుగా ఉన్న ప‌లు ప్రైవేట్ బ్యాంకుల బాసుల‌కు అందుతున్న వేత‌నాల‌తో పోలిస్తే మాత్రం... ఆమె ఉచిత సేవ‌లందిస్తున్న‌ట్టే లెక్క‌.

ఇక ప్రైవేట్ బ్యాంకుల బాసుల వేత‌నాల‌ను ఓసారి ప‌రిశీలిస్తే... ఐసీఐసీఐకి ఎండీగానే కాకుండా సీఈఓగా వ్య‌వ‌హరిస్తున్న చందా కొచ్చార్ వేత‌నం... ఏడాదికి అక్ష‌రాలారూ.6.09 కోట్లు. ఇందులో వేత‌నంతో పాటు ప‌నితీరుకు అందించే ప్రోత్సాహ‌కం, ఇత‌ర అల‌వెన్సులు క‌లుపుకుంటే ఈ మేర ఆమె ఏటా వేత‌నం తీసుకుంటున్నారు. ఇందులో కేవ‌లం వేత‌నం కింద పేర్కొనే మొత్తమే రూ.2.66 కోట్లు. ఇక యాక్సిక్ బ్యాంకు ఎండీ అండ్ సీఈఓగా వ్య‌వ‌హ‌రిస్తున్న శిఖా శ‌ర్మ వేతనం రూ.4.95 కోట్లు. ఇందులో వేత‌నంగా పేర్కొనే మొత్త‌మే... ఏడాదికి రూ.2.7 కోట్లు. ఇక య‌స్ బ్యాంకు ఎండీ అండ్ సీఈఓ రానా క‌పూర్ వేతనం కూడా ఏడాదికి రూ.6.8 కోట్లు.

ఇక అంద‌రి నోళ్ల‌లో ఇటీవ‌లి కాలంలో బాగా నానుతున్న హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంకు ఎండీ ఆదిత్యా పూరీ వేత‌న‌మైతే ఏకంగా రూ.10 కోట్లు. ఈ వేత‌నంతో పాటు ఆయ‌న గ‌తేడాది ఇత‌ర అల‌వెన్సుల కింద రూ.57 కోట్ల మేర విలువ స్టాక్స్‌ను సొంతం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా క‌లిపితే ఆయ‌నకు గ‌తేడాది రూ.67 కోట్ల మేర ముట్టింద‌న్న మాట‌. మ‌రి స్టేట్ బ్యాంకు కంటే కూడా చాలా చిన్న బ్యాంకులుగా ఉన్న వీటి ఛీఫ్‌ల‌కు కోట్లాది రూపాయ‌లు వేత‌నం అందుతుంటే... అందులో క‌నీసి ఐదు పైస‌ల వంతుకు కూడా సాటి రాని వేత‌నం తీసుకుంటున్న భ‌ట్టాచార్య అస‌లు వేత‌నం తీసుకోకుండా ప‌నిచేస్తున్న‌ట్టే క‌దా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/