Begin typing your search above and press return to search.

పిజ్జా డెలివరీకి అని చెప్పి.. జమ్ముపై దాడులా?

By:  Tupaki Desk   |   30 Jun 2021 10:00 AM IST
పిజ్జా డెలివరీకి అని చెప్పి.. జమ్ముపై దాడులా?
X
మారిన కాలానికి తగ్గట్లు..ఎప్పటికప్పుడు ముష్టి తెలివితేటల్ని ప్రదర్శిస్తూ..భారత్ కు చిరాకు తెప్పించే ప్రోగ్రాంలను చేపడుతూనే ఉంటుంది దాయాది పాకిస్థాన్. తాను పెంచి పోషించే ఉగ్రవాద కార్యకలాపాల్ని మార్చేస్తూ.. దాడులకు ప్లాన్ చేయటం తెలిసిందే. తాజాగా డ్రోన్లతో జమ్ము విమానాశ్రయంపై దాడులకు పాల్పడిన వైనంలో కొత్త కోణం తాజాగా బయటకు వచ్చింది.

ఇంత పెద్ద ఎత్తున డ్రోన్లు పాకిస్థాన్ కు ఎక్కడ నుంచి వచ్చాయన్న దానికి ఆసక్తికర సమాధానం లభిస్తోంది. ఇటీవల చైనా నుంచి పాక్ పెద్ద ఎత్తున డ్రోన్లను కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. చైనాకు పిజ్జా.. ఔషధాల డెలివరీ కోసం వినియోగించుకునేందుకు వీలుగా వీటిని కొన్నట్లు చెబుతున్నారు. ఇవే డ్రోన్లను జమ్ము వైమానిక స్థావరంపై దాడులకు పాల్పడేందుకు వినియోగించటం గమనార్హం.

ఆదివారం తెల్లవారుజామున (1.40 గంటల వేళలో) ఆరు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారటమే కాదు.. రెండు దేశాల మధ్య కొత్త ఉద్రికత్తలకు తెర తీసింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా డ్రోన్ మార్గాన్ని పరివీలిస్తున్నారు. పాక్ నుంచే డ్రోన్లు వచ్చి ఉంటాయని ప్రాధమికంగా భావిస్తున్నారు. తాజా డ్రోన్ దాడిలో నిషేధిత లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. వరుసగా మూడో రోజు కూడా జమ్ములో డ్రోన్లు కలకలం రేపాయి. మూడుసార్లు డ్రోన్లు కనిపించినట్లుగా చెబుతున్నారు. అయితే.. అధికారిక ప్రకటన ఏదీ విడుదల కాలేదు. వైమానిక శిబిరాల వద్ద డ్రోన్లు చక్కర్లు కొడుతుంటే.. సైనికులు కాల్పులు జరపటంతో అవి వెనక్కి వెళ్లినట్లు చెబుతున్నారు. డ్రోన్ దాడుల ఎపిసోడ్ పై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ అత్యున్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మరెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.