Begin typing your search above and press return to search.

సౌదీ సంచ‌ల‌న నిర్ణ‌యం..భ‌ర్త అనుమ‌తి అక్క‌ర్లేదు

By:  Tupaki Desk   |   19 Feb 2018 11:30 PM GMT
సౌదీ సంచ‌ల‌న నిర్ణ‌యం..భ‌ర్త అనుమ‌తి అక్క‌ర్లేదు
X
నిలువెత్తు బంధ‌నాలు వేసి నేటికీ ఇంటికే ప‌రిమితం చేసే వైనం సౌదీతో స‌హా కొన్నిదేశాల్లో క‌నిపిస్తుంది. ఆర్థికంగా విప‌రీతంగా అభివృద్ధి చెందిన సంప‌న్న దేశ‌మైన సౌదీలో మ‌హిళ‌ల‌కు ఉండే స్వేచ్ఛ చూసి అయ్యో అన‌కుండా ఉండ‌లేరు. ద‌శాబ్దాలుగా సాగుతున్న క‌ట్టుబాట్ల‌కు సంబంధించి ఇటీవ‌ల కాలంలో సౌదీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉంది.

మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ‌ను ఇవ్వ‌టంతో పాటు.. వారిపై ఉన్న ప‌రిమితుల్ని ఒక్కొక్క‌టిగా తొల‌గిస్తూ ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాల్ని తీసుకుంటోంది. డిజిట‌ల్ ప్ర‌పంచంలోనూ సౌదీ మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ లేదా? అంటూ ప్ర‌శ్నించే గొంతులకు ధీటుగా తాము మారుతున్నామ‌న్న సంకేతాల్ని సౌదీ స‌ర్కారు స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి.

మొన్న‌టికి మొన్న డ్రైవింగ్ చేసేందుకు మ‌హిళ‌ల‌కు అనుమ‌తి ఇచ్చిన సౌదీ స‌ర్కారు ఈ మ‌ధ్య‌నే మ‌హిళ‌లు స్టేడియంకు వెళ్లి సాక‌ర్ పోటీల్ని స్వ‌యంగా చూసేందుకు అనుమ‌తిని ఇచ్చారు. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యానికి సౌదీ స‌ర్కారు ఓకే చెప్పేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ సౌదీలో మ‌హిళ‌లు సొంతంగా బిజినెస్ చేయ‌టానికి వీల్లేదు. వారి త‌ల్లిదండ్రులో.. భ‌ర్త.. సోద‌రుడి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి.

వారి అంగీకార ప‌త్రం ఉంటేనే వ్యాపారం చేసే వీలు ఉంటుంది. ఈ ప‌రిమితిని ఎత్తేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై మ‌హిళ‌లు త‌మ‌కు తాముగా సొంతంగా వ్యాపారం చేసుకోవ‌టానికి వీలు క‌లిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై.. సౌదీలోని ఏ మ‌హిళా తాను వ్యాపారం చేయాలంటే ఇంట్లోని పురుషుల ప‌ర్మిష‌న్ అక్క‌ర్లేదు.

ఇందుకు సంబంధించిన రూల్ ను స‌వ‌రిస్తూ సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆదేశాల్ని జారీ చేసింది. ప్రైవేటు రంగంలో మ‌హిళ‌లు రాణించేందుకు వీలుగా తాజా నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. మ‌హిళ‌లు సొంతంగా వ్యాపారాలు చేసుకోవ‌టానికి అనుమ‌తిని ఇచ్చిన సౌదీ స‌ర్కారు మ‌రో ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకొంది.

సౌదీ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్స్ విభాగంలో తొలిసారి ఒక మ‌హిళా ఇన్వెస్టిగేట‌ర్స్ ను నియ‌మించ‌నుంది. అంతేకాదు.. ఎయిర్ పోర్టులు.. స‌రిహ‌ద్దుల్లో ఖాళీగా ఉన్న 140 ఉద్యోగాల్లో మ‌హిళ‌ల్ని అపాయింట్ చేసుకోవ‌టానికి వీలుగా సౌదీ స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా.. ఇందుకు సౌదీ మ‌హిళ‌లు పెద్ద ఎత్తున ఓకే చేప్పేస్తూ వేలాదిగా అప్లికేష‌న్లు పెడుతున్నారు. ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేళ క‌ళ్ల‌ముందుకు వ‌స్తే ఇంకెందుకు వెయిట్ చేస్తారు చెప్పండి?