Begin typing your search above and press return to search.

అమ్మాయిల‌కు దేవుడిగా మారిన సౌదీ రాజు

By:  Tupaki Desk   |   6 May 2017 5:35 AM GMT
అమ్మాయిల‌కు దేవుడిగా మారిన సౌదీ రాజు
X
సౌదీ లాంటి దేశాల్లో మ‌హిళ‌ల‌పై ఎన్ని ఆంక్ష‌లు ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. డిజిట‌ల్ యుగంలోనూ.. ఆ దేశంలో ఇప్ప‌టికీ మ‌హిళ‌లు కార్ల‌ను న‌డప‌కూడ‌దు. నిజానికి ఇదోశాంపిల్ మాత్ర‌మే. ఇలాంటి ఆంక్ష‌లు మ‌హిళ‌ల‌కు స‌వాల‌చ్చ ఉంటాయి. ఇలాంటి ఆంక్ష‌ల దేశంలో సౌదీ రాజు ఇటీవ‌ల కాలంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి.

మారిన కాలానికి త‌గ్గ‌ట్లే దేశాన్ని.. దేశ ప్ర‌జ‌ల్లో మార్పు తీసుకురావాల‌న్న కాంక్ష ఆయ‌న‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆయ‌న తీసుకున్న ఒక నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. అక్క‌డి మ‌హిళ‌ల‌కు ఇప్పుడాయ‌న దేవుడిలా మారారు. మ‌హిళ‌ల‌పై ఏళ్ల‌కు ఏళ్లుగా సాగుతున్న ఆంక్ష‌ల‌కు భిన్నంగా సౌదీ రాజు స‌ల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇక‌పై.. సౌదీలో ఎవ‌రైనా అమ్మాయి తాను కానీ ఉద్యోగం చేయాల‌ని అనుకుంటే.. అందుకు ఆమె త‌ల్లిదండ్రులు కానీ.. సంర‌క్ష‌కులు కానీ ఎలాంటి అంగీకార ప‌త్రాల్ని అందించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న తాజాగా ఆ దేశంలోని స్థానిక ప‌త్రిక‌ల‌కు ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ప్ర‌భుత్వ సేవా సంస్థ‌ల్లో ఉద్యోగాలు చేయాల‌నుకునే మ‌హిళ‌లు త‌మ ఇష్టానికి త‌గ్గ‌ట్లుగా ఉద్యోగం చేసే వీలుంది. ఇంత కాలం అలాంటి అవ‌కాశం ఉండేది కాదు. ఎవ‌రైనా మ‌హిళ సౌదీలో ఉద్యోగం చేయాలంటే.. విధిగా వారి ఇంట్లోని త‌ల్లిదండ్రులు.. సంర‌క్షకుల నుంచి ఆమోద ప‌త్రం స‌మ‌ర్పించాల్సి ఉండేది. సౌదీ రాజు తాజాగా తీసుకున్న నిర్ణ‌యం పుణ్య‌మా అని ఇక‌పై అలాంటి అవ‌స‌రం ఉండ‌ద‌నే చెప్పాలి.

అంతేకాదు.. తాజా నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వ సేవా సంస్థ‌ల‌కు మాత్ర‌మే కాదు.. ప్రైవేటు సంస్థ‌ల‌కు కూడా వ‌ర్తిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. మ‌హిళ‌ల‌కు ఉద్యోగాలు ఇచ్చే సంస్థ‌లు.. వారి ర‌వాణా సౌక‌ర్యాల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆంక్ష‌ల దేశంలో మ‌హిళ‌ల ఇష్టానికి పెద్ద‌పీట వేస్తూ తాజాగా సౌదీరాజు తీసుకున్న నిర్ణ‌యంతో ఆయ‌నిప్పుడు ఆ దేశ మ‌హిళ‌ల‌కు దేవుడిగా మారార‌న‌టంలో సందేహం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/