Begin typing your search above and press return to search.

బైడెన్ కు వార్నింగ్ ఇచ్చిన సౌదీ అరేబియా అధ్యక్షుడు

By:  Tupaki Desk   |   5 March 2022 3:53 AM GMT
బైడెన్ కు వార్నింగ్ ఇచ్చిన సౌదీ అరేబియా అధ్యక్షుడు
X
చదివినంతనే అర్థం కాదు కానీ.. ఇది నిజం. అమెరికాకు.. సౌదీ అరేబియా లాంటి పిల్లదేశం వార్నింగ్ ఇవ్వటమా? అంటే.. అవుననే చెప్పాలి. మారిన పరిస్థితులు.. సమీకరణాల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు.. సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వార్నింగ్ ఇచ్చేశారు. ప్రపంచానికి పెద్దన్నగా తనకు తాను సర్వాధికారిగా భావించే అమెరికాకు.. ఈ పరిణామం ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో మిడిల్ ఈస్ట్ లో అగ్రరాజ్యానికి తగ్గుతున్న పట్టుకు ఇదో నిదర్శనంగా చెప్పాలి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

తాజాగా సౌదీ అధ్యక్షుడు ‘అట్లాంటిక్’ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అమెరికా గురించి సూటిగా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ‘‘మాది సంపూర్ణ రాజరిక దేశం. అమెరికా సొంత విషయాలపై అధ్యక్షుడు బైడెన్ మాట్లాడాలి. నా గురించి బైడెన్ అపార్థం చేసుకున్నా పట్టించుకోను. అమెరికా గురించి మాకుఅవసరం లేదు. వారికి కూడా ఇదే వర్తిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

ఆ దేశంతో చిరకాల బంధాన్ని బలోపేతం చేసుకోవటమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో రష్యా తీరును ఖండించే విషయంలో ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తున్న సౌదీ అరేబియా.. అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. అమెరికాతో పెరిగి దూరానికి తగ్గట్లే.. తన కొత్త భాగస్వామిగా రష్యాకు పరోక్ష మద్దతు ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

హౌతీపై మిసైల్‌, డ్రోన్ దాడులు చేసే అంశంలో యూఎస్‌, యూఏఈ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్‌ మద్దతిస్తున్న హౌతీ రెబల్స్‌ను ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి యూఎస్‌ తొలగించడంతో అబుదాబి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ.. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఉక్రెయిన్ లో పరిస్థితులు చక్కబడటానికి ప్రపంచ దేశాలు తీసుకునే చర్యలకు సహకరిస్తామని సౌదీ పేర్కొంది.

అదే సమయంలో రష్యాపై ఆంక్షలు విధించాలన్న అగ్రరాజ్య ఆదేశాన్ని రిజెక్టు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అమెరికాకు సౌదీ వ్యతిరేక గొంతుతో మాట్లాడుతున్న సమయంలోనే.. సౌదీకి ప్రత్యర్థిగా ఉన్న ఇరాన్.. సిరియాలు రష్యా చర్యలకు బహిరంగంగా మద్దతు ఇవ్వటం చూస్తుంటే.. రానున్న రోజుల్లో కొత్త సమీకరణాలకు తెర లేస్తుందన్న భావన కలుగక మానదు. ఏమైనా.. అగ్రరాజ్య పెద్దరికానికి సవాలు విసిరేలా సౌదీ అధ్యక్షుడి తాజా వార్నింగ్ ఉందన్న మాట వినిపిస్తోంది.