Begin typing your search above and press return to search.

పది రోజుల్లో 12 మందిని ఉరి తీయించిన సౌదీ..!

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
పది రోజుల్లో 12 మందిని ఉరి తీయించిన సౌదీ..!
X
సౌదీ అరేబియాలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ నియమాలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని కఠినంగా శిక్షించేందుకు సౌదీ రాజులు ఏమాత్రం వెనుకాడరు. ఆ దేశంలో చిన్న తప్పు చేసిన సరే ఉరి శిక్ష విధించేందుకు సైతం అక్కడి ప్రభుత్వం వెనుకడదని పలు సందర్భాల్లో రుజువైంది. దీంతో ప్రపంచంలో అత్యధికంగా ఉరి శిక్షలు అమలవుతున్న దేశాల్లో సౌదీ ముందు వరుసలో నిలుస్తుంది.

అయితే సౌదీకి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తమ దేశంలో ఉరి శిక్షను వీలైనంత వరకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గత రెండేళ్లుగా ఆ దేశంలో ఉరి శిక్షలు తక్కువగా అమలు చేస్తున్నారు. కాగా గడిచిన పది రోజుల్లోనే 12 మందికి సౌదీ ప్రభుత్వం ఒకేసారి ఉరి తీయడం సంచలనంగా మారింది. సౌదీ నిర్ణయంపై పలువురు మానవ హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాన్ వయోలెంట్ డ్రగ్స్ ఆరోపణలతో 12మంది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరి జైలు జీవితం పూర్తయిన తర్వాత సౌదీ ప్రభుత్వం 12 మందిని కత్తితో తలలు నరికి వేసే ఉరి శిక్షణ అమలు చేసింది. గడిచిన రెండేళ్లలో ఇలాంటి శిక్షను అమలు చేయడం ఇదే తొలిసారి. ఈ శిక్షకు గురైన వారిలో ముగ్గురు పాకిస్తానీలు.. నలుగురు సిరియా.. ఇద్దరు జోర్డాన్.. ముగ్గురు సౌదీ వాసులు ఉండటం గమనార్హం.

2020, 2021 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది సౌదీ విధించిన మరణాల సంఖ్య భారీగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సౌదీ ప్రభుత్వం తాజాగా విధించిన ఉరి శిక్షలను కలుపుకొని 132 మందికి మరణ శిక్షను అమలు చేసింది. అయితే 2018లో సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉరి శిక్షను వీలైనంత వరకు తగ్గిస్తామని హామీ ఇచ్చింది.

ఈ క్రమంలోనే నరహత్యలకు పాల్పడే వారికే సౌదీలో ఉరి శిక్షలు అమలు చేస్తామని సౌదీ రాజు ప్రకటించారు. అయితే ప్రస్తుతం డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులకు సైతం ఉరి శిక్ష అమలు చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సౌదీలో పరిస్థితులు చూస్తుంటే సౌదీ రాజు చెప్పిన దానికి ప్రభుత్వం అమలు చేస్తున్న దానికి పొంతన లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.