Begin typing your search above and press return to search.

సౌదీ మారుతోంది.. సినిమాహాల్ ఓపెన్!

By:  Tupaki Desk   |   19 April 2018 5:30 PM GMT
సౌదీ మారుతోంది.. సినిమాహాల్ ఓపెన్!
X
రూల్స్ చిట్టా చ‌దువుతుంటేనే చిన్న‌పాటి వ‌ణుకు వ‌చ్చే ప‌రిస్థితి. అన్నేసి ఆంక్ష‌ల మ‌ధ్య మ‌నుషులు బ‌త‌క‌టం సాధ్య‌మేనా? అన్న సందేహం ప‌లువురికి క‌లిగే ప‌రిస్థితి. మ‌హిళ‌లు డ్రైవింగ్ చేసే అవ‌కాశం లేక‌పోవ‌టం.. స్టేడియంల‌కు వ‌చ్చే వీలు లేక‌పోవ‌టం.. చివ‌ర‌కు హోట‌ళ్ల‌కు వెళ్లినా.. మ‌రే బ‌హిరంగ ప్ర‌దేశానికి వెళ్లినా పై నుంచి కింద వ‌ర‌కూ క‌నిపించ‌కుండా ఉండేలా డ్రెస్ వేసుకోవ‌టం మొద‌లు.. కారు డ్రైవింగ్ చేసే అవ‌కాశం లేక‌పోవ‌టం లాంటి ఎన్నో ఆంక్ష‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ సౌదీ అరేబియా.

అయితే.. ఈ ఆంక్ష‌ల్లో కొన్నింటి మీద ఉన్న బ్యాన్ ను ఎత్తేస్తున్నారు సౌదీ యువ‌రాజు. ఇటీవ‌ల కాలంలో సంస్క‌ర‌ణ‌ల ర‌థాన్ని ప‌రుగులు తీస్తూ.. దేశంలోని ప్ర‌జ‌ల‌కు స‌రికొత్త‌స్వేచ్ఛ‌ను ఇస్తున్న వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ మ‌ధ్య‌నే మ‌హిళ‌లు డ్రైవింగ్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించిన సౌదీ స‌ర్కార్ తాజాగా దేశ రాజ‌ధాని రియాద్ లో ఒక సినిమాహాల్ ను ఓపెన్ చేసింది.

35 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంత‌రం సినిమాలు చూసేలా ఈ థియేట‌ర్ ను ఓపెన్ చేశారు. ఈ థియేట‌ర్లో విదేశీ ప్రేక్ష‌కుల్ని కూడా వీక్షించే వీలుంది. ఇప్ప‌టివ‌ర‌కూ కొన్ని ఆంక్ష‌లు.. మ‌త‌ప‌ర‌మైన కార‌ణాల‌తో సైదీ వ్యాప్తంగా ఒక్క థియేట‌ర్ కూడా లేదు. ఇప్పుడా లోటును క‌వ‌ర్ చేస్తూ కొత్త థియేట‌ర్ ను ప్రారంభించారు.

35 ఏళ్ల సుదీర్ఘ నిషేధానికి మంగ‌ళం ప‌లుకుతూ థియేట‌ర్ ఓపెనింగ్ కు సౌదీ సాంస్కృతిక శాఖ మంత్రితో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు.. ఫిలింమేక‌ర్స్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు థియేట‌ర్ కు హాజ‌ర‌య్యారు. దేశంలోకి తిరిగి సినిమాను ఆహ్వానించ‌టం ద్వారా దేశ ఆధునిక సాంస్కృతిక చ‌రిత్ర‌కు నాంది ప‌లికిన‌ట్లుగా చెప్పారు.

సౌదీ రాజు మ‌హ్మ‌ద్ బిన్ సల్మాన్ దేశ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి సౌదీ ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ‌ను ద‌శ‌ల వారీగా క‌ల్పిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాల్ని తీసుకుంటున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే విజ‌న్ 2030 పేరుతో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. 2030 నాటికి దేశంలో 350 సినిమాల‌ను.. 2500 స్క్రీన్ల‌ను ప్రారంభించాల‌న్న ఆలోచ‌న‌లో సౌదీ స‌ర్కార్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఆల‌స్య‌మైనా.. చాలా వేగంగానే థియేట‌ర్ల‌ను విస్త‌రించే ప్రోగ్రామ్ ను సౌదీ పెట్టుకుందిగా.