Begin typing your search above and press return to search.

సౌదీ రాజు కీలక నిర్ణయం..ఆ శిక్షకు చెల్లుచీటి

By:  Tupaki Desk   |   26 April 2020 10:55 AM IST
సౌదీ రాజు కీలక నిర్ణయం..ఆ శిక్షకు చెల్లుచీటి
X
తప్పు చేసేందుకు వణికిపోవటం సౌదీ ఆరేబియాలో కనిపిస్తుంది. చిన్న తప్పుకైనా పెద్ద శిక్ష విధించటం.. అది కూడా అందరిముందు.. బహిరంగంగా విధించే ఈ తీరు ప్రజల్లో భయాన్ని పుట్టించటమే కాదు.. తప్పు చేసేందుకు అస్సలు ఇష్టపడని రీతిలో ఉంటుంది. సౌదీ అన్నంతనే కఠినమైన శిక్షలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటం తెలిసిందే. ఇక్కడ విధించే శిక్షల్లో ప్రముఖమైనది.. తప్పు చేసిన వారికి బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టే విధానం.

ఈ శిక్షపై తాజాగా సౌదీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై తప్పులు చేసే వారికి విధించే శిక్షల్లో కొరడా దెబ్బలు కొట్టే విధానానికి చెల్లుచీటి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సౌదీ రాజు సల్మాన్.. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీసుకున్న నిర్ణయంతో కొరడా దెబ్బల శిక్షకు చెక్ పెట్టేస్తున్నట్లుగా ప్రకటించారు.

2014లో రైఫ్ బద్వాయ్ అనే వ్యక్తి ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణతో ఆయనకు పదేళ్ల జైలుతో పాటు.. వెయ్యి కొరడా దెబ్బల శిక్షను విధించారు. దీనిపై మానవహక్కుల సంఘం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సౌదీ విధించే కొరడా దెబ్బల శిక్షను పలువురు వ్యతిరేకిస్తుంటారు. అయినప్పటికీ ఆ దేశ ప్రభుత్వం మాత్రం ఈ శిక్షను ఇప్పటివరకూ అమలు చేస్తూనే ఉంది.

తాజాగా తీసుకున్న నిర్ణయంతో కొరడా దెబ్బలకు బదులుగా.. ఇప్పటివరకూ అమల్లో ఉన్న జైలు.. జరిమానాను కలిపి విధిస్తారు. ఇటీవల కాలంలో పలు నిబంధనల్ని సడలిస్తూ సౌదీ సర్కారు తీసుకుంటున్న చర్యల్లో తాజా నిర్ణయం కీలకమైనదిగా అభివర్ణిస్తున్నారు.