Begin typing your search above and press return to search.

మేఘాలయ గవర్నర్ కు మూడినట్లే.. మోడీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 Nov 2021 10:41 AM IST
మేఘాలయ గవర్నర్ కు మూడినట్లే.. మోడీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు
X
తాను అనుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేసే అతి కొద్ది మంది గవర్నర్లతో మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఒకరు. గవర్నర్ స్థానంలో ఉన్న వారు అతి తక్కువగా మాట్లాడటం.. కేంద్రానికి వీర విధేయులుగా ఉండటం.. తమను నియమించిన కేంద్రానికి దాసులుగా ఉంటూ.. కేంద్రంపై ఒక్క విమర్శ చేయటానికి సిద్ధంగా లేని తీరు కనిపిస్తుంది. అందుకు భిన్నంగా మోడీ సర్కారు బట్టలు విప్పదీసినట్లుగా చేసిన ఆయన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మాత్రమే కాదు.. హాట్ టాపిక్ గా మారాయి. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో జరిగిన ప్రపంచ జూట్ సదస్సులో మాట్లాడిన సందర్భంగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంలో కొలువు తీరిన మోడీ సర్కారును ఉద్దేశించి పలు విమర్శలు చేసిన ఆయన మాటలు వింటే.. నిజమే కదా? మోడీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటమా? అన్న సందేహం కలిగేలా చేయటం ఖాయం. దేశంలో మరే గవర్నర్ చేయలేని సాహసాన్ని చేసిన సత్యమాలిక్ మాట్లాడిన మాటలు.. ఆయన గవర్నర్ గిరిని సైతం ప్రభావితం చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

కమలనాథులు కస్సుమనేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపేలా ఉన్నాయి. ‘కుక్క చనిపోయినా ఢిల్లీ నేతలు సంతాపం తెలుపుతారు. కానీ.. తీవ్రమైన చలిలో ఆందోళన చేస్తున్న రైతులు చనిపోతే పట్టించుకోరా?’ అంటూ సంధించిన సూటి ప్రశ్న కేంద్రానికి మంట పుట్టేలా మారుతుందనటంలో సందేహం లేదు. అంతేకాదు.. తాను పుట్టుకతోనే గవర్నర్ ను కాదని.. తన పదవిని వదులుకోవటానికైనా సిద్ధంగా ఉన్నానని.. రైతుల విషయం మోడీ సర్కారు తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టటం గమనార్హం. తాను చేసిన విమర్శలకు శిక్షగా తనను గవర్నర్ పదవి నుంచి తప్పించినా.. అందుకు సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని ఆయన చెప్పేయటం విశేషం.

‘‘రైతులపై నా నిబద్ధతను వదులుకోను. అన్నదాతల ఇబ్బందులను చూస్తూ సహించలేను. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 600 మంది రైతులు చనిపోయారు. మోడీ సర్కారు ఈ విషయంలో ఇంకా ఎలాంటి తీర్మానం చేయలేదు. రైతుల ఆందోళనపై నేనేం మాట్లాడినా వివాదాస్పదమే అవుతోంది. అయినా రైతుల ఉద్యమానికి నా మద్దతు ఉంటుంది’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన పదవికి రాజీనామా చేయాలని అడిగితే.. గవర్నర్ పదవిని వదులుకోవటానికి సిద్ధంగా ఉన్ననని చెప్పిన ఆయన.. మోడీ కలల ప్రాజెక్టుల్లో ఒకటైన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సైతం తీవ్రంగా తప్పు పట్టారు. ‘కొత్త పార్లమెంటు భవనానికి బదులుగా ప్రపంచస్థాయి కాలేజీ కడితే బాగుంటుందన్నది నా అభిప్రాయం’ అంటూ తన ఆలోచనను బయటపెట్టేశారు. అంతేకాదు.. రైతుల ఆందోళనను కేంద్రం పట్టించుకోకపోవటాన్ని ప్రస్తావించిన ఆయన.. ‘‘1984లో ప్రధాని ఇందిరను ఆమె బాడీగార్డులే కాల్చేశారు. ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలామంది సిక్కులు.. జూట్లు ఉన్నారు. వారికి కోపం తెప్పించొద్దని ప్రధాని మోడీని అప్రమత్తం చేశా. నాడు గురుద్వారా ఘటన నేపథ్యంలో తాను చనిపోతానని ఇందిరాగాంధీకి తెలుసు. అందుకే ఆమె తన ఫాంహౌస్‌లో మహామృత్యుంజయ హోమాన్నినిర్వహించారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

పవర్ లో ఉన్నామన్న గర్వం మోడీలో ఉందని.. ఈ కారణంగా రేపు ఏమైనా జరగొచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా జనం గళం విప్పుతారని.. రైతులు ఆగ్రహించే రోజు రాకూడదని తాను భావిస్తున్నట్లుగా మేఘాలయ గవర్నర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడాయన మాటలు పెను సంచలనంగా మారాయి. మరి.. దీనిపై మోడీ సర్కారు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.