Begin typing your search above and press return to search.

జైలు చెర నుంచి 'స‌త్యం' బ‌య‌ట‌కు..

By:  Tupaki Desk   |   2 April 2017 12:55 PM IST
జైలు చెర నుంచి స‌త్యం బ‌య‌ట‌కు..
X
సంప‌న్న కుటుంబం కాదు. సెల‌బ్రిటీ అంత‌క‌న్నా కాదు. పేద‌రికంతో మ‌గ్గుతూ.. ఎలాంటి అండా లేని కుటుంబానికి చెందిన ఒక వ్య‌క్తి.. అన్యాయంగా జైలుకు వెళితే.. ఆత‌డ్ని కాపాడేందుకు కొమ్ములు తిరిగిన హీరో సీన్లోకి రావ‌టానికి ఇది సినిమా ఎంత‌మాత్రం కాదు. ఇది రియ‌ల్ లైఫ్. ఇలాంటి చోట ఎలాంటి అండా లేని వారికి కూడా న్యాయం జ‌రుగుతుందా? అన్న సందేహానికి స‌మాధానంగా అయేషా హ‌త్య‌కేసులో స‌త్యంబాబు ఉదంతం నిలుస్తుంది.

ఒక అమ్మాయిని రేప్ చేసి.. చంపేశార‌న్న దారుణమైన ఆరోప‌ణ‌ను ఒక అమాయ‌కుడి మీద వేసేసి.. అత‌డ్ని 8 ఏళ్ల పాటు జైల్లో ఉంచేసిన వైనం విన్న‌ప్పుడు.. స‌త్యానికి ఇంత చెర‌? అన్న సందేహం క‌ల‌గ‌టం ఖాయం. అయితే.. అయేషా ఉదంతంలో స‌త్యంబాబుకు ఎలాంటి పాత్ర లేద‌ని న‌మ్మిన పౌర‌హ‌క్కుల సంఘాల వారు.. కొంద‌రు న్యాయ‌వాదుల పుణ్య‌మా అని.. వారు జ‌రిపిన సుదీర్ఘ న్యాయ‌పోరాటానికి చిహ్నంగా.. స‌త్యంబాబు ఈ రోజు విడుద‌ల‌య్యారు.

అయేషా హ‌త్య కేసులో ముద్దాయిగా ముద్ర వేసిన నాటి నుంచి.. త‌న‌కే పాపం తెలీద‌న్న‌ప్ప‌టికీ.. ప‌ట్టించుకున్న నాథుడే లేడు. అంతో ఇంతో అత‌డి వాద‌న‌ను విన్న వారు ఎవ‌రైనా ఉన్నారా? అంటే.. అది మీడియానే అని చెప్పాలి. పోలీసుల విచార‌ణ మీదా.. స‌త్యంబాబును దోషిగా చిత్రీక‌రిస్తున్న పోలీసుల తీరు పైనా.. వారి విచార‌ణ‌పైనా ప‌లు సందేహాలు వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. స‌త్యంబాబును దోషిగా నిర్దారించే విష‌యంలో కోర్టు సైతం త‌ప్ప‌ట‌డుగు వేసింద‌న్న విమ‌ర్శ ఉంది.

అందుకే.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. హైకోర్టులో సుదీర్ఘంగా న్యాయ‌పోరాటాన్ని చేశారు. చివ‌ర‌కు.. ఈ కేసులో స‌త్యంబాబుకు ఎలాంటి సంబంధం లేద‌న్న విష‌యాన్ని అత‌డి త‌ర‌ఫు లాయ‌ర్లు నిరూపించ‌టంలో స‌క్సెస్ కావ‌ట‌మే కాదు.. ఎనిమిదేళ్ల శిక్ష త‌ర్వాత నిర్దోషిగా స‌త్యంబాబు బ‌య‌ట‌కు వ‌చ్చాడు. హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌బ్ జైలు నుంచి స‌త్యంబాబు విడుద‌ల‌య్యాడు. తాను జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని ఎప్పుడూ న‌మ్మ‌లేద‌న్న అత‌డు.. త‌న కోసం పోరాడిన లాయ‌ర్లు.. జ‌ర్న‌లిస్ట్ మిత్రుల‌కు థ్యాంక్స్ చెప్పాడు. త‌న మాదిరే త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో జైల్లో మ‌గ్గుతున్న అమాయ‌కులు చాలామందే ఉన్నార‌ని వాపోయాడు.

అయేషా హ‌త్య కేసులో న్యాయం గెలిచింద‌ని.. అస‌లైన దోషుల‌కు శిక్ష ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. ఈ హ‌త్య కేసులో త‌న‌కు ప్ర‌మేయం లేద‌ని మొద‌టి నుంచి త‌న త‌ల్లిదండ్రులు చెప్పిన విష‌యాన్ని గుర్తు చేసిన స‌త్యంబాబు.. త‌న కుటుంబం దీన స్థితిలో ఉంద‌న్నారు. అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ చ‌దివాన‌ని వెల్ల‌డించాడు. అయేషా త‌ల్లిదండ్రుల‌కు న్యాయం జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. త‌న‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌న్నారు. స‌త్యంబాబు గోడును కోర్టు ఎట్ట‌కేల‌కు వింది. అసాధార‌ణంగా అన్యాయానికి గురై.. ఎనిమిదేళ్లు దారుణ శిక్ష‌కు గురైన అత‌డ్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గుర్తించి.. అత‌డికి న్యాయం క‌లిగేలా ఏదైనా చేస్తారా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రి మ‌దిలో మెదులుతుంది. చ‌ట్టం చేసిన త‌ప్పును.. ఏపీ సీఎం స‌రిదిద్దితే.. అదో చారిత్ర‌కం అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/