Begin typing your search above and press return to search.

అయేషాను సత్యంబాబు చంపలేదని తేల్చారు

By:  Tupaki Desk   |   1 April 2017 9:31 AM IST
అయేషాను సత్యంబాబు చంపలేదని తేల్చారు
X
వందమంది దోషులు తప్పించుకున్నా తప్పు లేదు కానీ.. ఒక నిర్దోషి మాత్రం శిక్ష అనుభవించకూడదన్నది న్యాయసూత్రాలు చెప్పు తొలిమాటలు. కానీ.. తెలుగు నాట సంచలనం సృష్టించిన అయేషామీరా హత్య కేసులో నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేసిన సత్యంబాబు తప్పు చేయలేదని.. అతడు నిర్దోషి అని.. 8ఏళ్ల జైలుశిక్ష తర్వాత హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయేషా హత్యతోనూ.. అత్యాచార ఆరోపణలతో సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. అంతేకాదు.. గతంలో ఇదే ఇష్యూలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ హత్యలో అసలు నేరస్తుడ్ని తప్పించేందుకు సత్యంబాబును ఇరికించారన్న భావనను వ్యక్తం చేయటంతో పాటు.. ఎలాంటి తప్పు చేయకుండానే..ఇన్నేళ్లు జైలుశిక్ష అనుభవించిన సత్యంబాబుకు పరిహారం ఇవ్వాలంటూ ఆదేశించే అధికారం తమకు లేనందున.. ఆ విషయంపై తుది నిర్ణయం అతడే తేల్చుకోవాలని కోర్టు సూచించింది.

అసలు దోషుల్నితప్పించేందుకే పోలీసులు సత్యంబబును ఇరికించినట్లుగా.. కేసును తప్పుదారి పట్టించినట్లుగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇతర కేసుల్లో అవసరం ఉంటే తప్పించి.. అతన్ని వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అయేషా మీరా కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నంలోని శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్ లో ఉండేది. బీ ఫార్మసీ చదువుతున్న ఆమెను 2007 డిసెంబరు27న ఆమెపై అత్యాచారం చేసి..హత్య చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అవి తీవ్రసంచలనాన్ని రేపాయి. ఈ ఉదంతంలో నిందితుడిగా సత్యంబాబును అదుపులోకి తీసుకున్నపోలీసులు..అతడిపై పలు ఆరోపణలు చేశారు. అందుకు తగ్గట్లే.. కిందికోర్టు అతడ్నిదోషిగా నిర్దారిస్తూ జీవిత ఖైదు శిక్ష విధించింది.

అయితే.. అతడు నిర్దోషి అని.. అతనే తప్పు చేయలేదంటూ చేస్తున్న వాదనను తాజాగా హైకోర్టు అంగీకరించటమే కాదు..అతడ్నినిర్దోషిగా పేర్కొంటూ సంచలన తీర్పు ఇచ్చింది.అయ్యేషాను సత్యంబాబు చంపలేదనటానికి బలమైన వాదనను వినిపించారు.లాజిక్ కు దగ్గరగా ఉన్న ఆ వాదన చూస్తే..50కేజీల బరువు ఉన్న వ్యక్తి 8అడుగుల గోడను ఒక చేత్తో ఎక్కటం.. మరో చేత్తో రోకలి బండను పట్టుకొని ఎక్కటం ఎలా సాధ్యమన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. అంతేనా.. ఆమెకు ఐలవ్ యూ చెబితే నో అన్నందుకే ఆమెను హత్య చేసినట్లుగా చెబుతున్న పోలీసులు.. రెండుసార్లు అత్యాచారానికి గురైనట్లుగా చెప్పే పోలీసులు.. అయేషా మర్మాంగానికి ఎలాంటి గాయం కాలేదన్నదానిపై.. అందరూ నమ్మేలా ఎలాంటి వాదనను వినిపించకపోవటం గమనార్హం. అత్యాచారం..హత్య చేసిన వ్యక్తి.. చుట్టూ 55 మంది విద్యార్థినులు నిద్రిస్తున్న వేళలో..అక్కడే కూర్చొని లేఖ రాయటం ఏ మాత్రంసాధ్యం కాదని.. మానవ నైజం ప్రకారం అలా చేసే అవకాశం లేదన్న వాదనను కోర్టు సమర్థించింది.

అయేషా హత్య కేసులో సత్యంబాబుపై పోలీసులు చేసిన ఆరోపణలు తప్పని.. అసలైన నిందితుల్ని కాపాడే ఉద్దేశమే కనిపిస్తుంది తప్పించి మరెలాంటిది లేదన్న వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకొని అతడ్ని నిర్దోషిగా ప్రకటించింది. బాగానే ఉన్నా.. ఎలాంటి తప్పు చేయకుండా ఎనిమిదేళ్ల నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న సత్యంబాబుకు అసలైన న్యాయం జరిగేదెప్పుడు..? అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈకేసులో సత్యంబాబును ఇరికించిన పోలీసులు.. నాటి కేసును దర్యాఫ్తు చేసిన అధికారులు తాజాతీర్పుపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు చూడాలి. సత్యంబాబును నిర్దోషిగా తేల్చిన కోర్టు.. కేసును తప్పు దారిపట్టించేలా విచారణ జరిపిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు..? అన్నది అసలు ప్రశ్న. దానికి సమాధానం లభించేదెప్పుడు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/