Begin typing your search above and press return to search.

క‌డ‌ప టీడీపీకి భారీ దెబ్బ‌..వైసీపీలోకి స‌తీష్‌ రెడ్డి

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:12 AM GMT
క‌డ‌ప టీడీపీకి భారీ దెబ్బ‌..వైసీపీలోకి స‌తీష్‌ రెడ్డి
X
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో పుంజుకోవాల‌ని భావిస్తున్న ప్ర‌ధాన విప‌క్షం టీడీపీకి భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఇప్ప‌టికే ఈ జిల్లాలో పార్టీ జెండా ప‌ట్టుకునే నాధుడు క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో ఇప్పుడు తాజాగా ఎదురైన ప‌రిణామం మ‌రింతగా పార్టీని కుంగ‌దీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం - వైఎస్ కుటుంబానికి కంచుకోట‌గా ఉన్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్‌ గా ఉన్న శింగా వెంక‌ట స‌తీష్‌ కుమార్ రెడ్డి ఇప్పుడు సైకిల్ దిగేందుకు రెడీ అయ్యారు. ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా టీడీపీ ఖంగుతిన్న‌ద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

1978 నుంచి పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం వైఎస్ కుటుంబానికి అండ‌గా నిలిచింది. దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇక్క‌డ నుంచి అనేక మార్లు విజ‌యం సాధించారు. 1999 - 2004 - 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా హ్యాట్రిక్ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌ర‌ణాంత‌రం రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఏర్ప‌డిన వైసీపీ నుంచి 2012లో ఇక్క‌డ వైఎస్ స‌తీమ‌ణి విజ‌యమ్మ పోటీ చేసి విజ‌యం సాధించారు. త‌ర్వాత 2014 - 2019 ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ విజ‌య‌దుందుభి మోగించారు. కాగా, ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున 2004 - 2009 - ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోస‌తీష్ రెడ్డి వైఎస్ కుటుంబంపై పోటీ చేశారు.

ఆయ‌న ప్ర‌తి ఎన్నిక‌లోనూ ఓట‌మి చ‌వి చూశారు. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌నే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి అండ‌గా నిలిచారు. అయితే, జిల్లాలో టీడీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన నాయ‌కులుగా ఉన్న‌సీఎం ర‌మేష్‌ - ఆదినారాయ‌ణ రెడ్డి వంటివారు త‌మ దారి తాము చూసుకోవ‌డం - ఇప్ప‌ట్లో ఇక్క‌డ టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి కూడా లేక‌పోవడం వంటి ప్ర‌ధాన కార‌ణాల నేప‌థ్యంలో స‌తీష్‌ రెడ్డి పార్టీ కి రాం రాం చెప్ప‌నున్నార‌నే క‌థ‌నాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా జ‌గ‌న్‌ తోనూ ఆయ‌న సంప్ర‌దింపులు జ‌రిపార‌ని - ఈ చ‌ర్చ‌లు స‌క్సెస్ అయ్యాయ‌ని స‌మాచారం.

క్రిస్ట‌మ‌స్ త‌ర్వాత రోజు అంటే ఈ నెల 26న ఆయ‌న టీడీపీ సైకిల్ దిగి వైసీపీ ఫ్యాన్ కింద‌కు చేర‌నున్నార‌ని తాజాగా సంకేతాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అదేరోజు.. జ‌గ‌న్ స్వ‌యంగా క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీకి రాజంపేట‌లో శంకు స్థాప‌న చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా టీడీపీకి బ‌ల‌మైన దెబ్బ‌కొట్టే క్ర‌మంలో భాగంగా స‌తీష్‌ రెడ్డికి పార్టీ కండువా క‌ప్ప‌నున్నార‌ని అంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో ? చూడాలి.