Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ దెబ్బ‌తో..స‌తీష్ రెడ్డికి స‌న్యాసం త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   16 April 2017 4:45 AM GMT
జ‌గ‌న్ దెబ్బ‌తో..స‌తీష్ రెడ్డికి స‌న్యాసం త‌ప్ప‌దా?
X
సింగారెడ్డి వెంక‌ట‌ స‌తీష్ కుమార్ రెడ్డి... ఈ పేరు దాదాపుగా ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. అయితే వేంప‌ల్లె స‌తీష్ రెడ్డి అంటే మాత్రం ఇట్టే మ‌న క‌ళ్ల ముందు టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ప్ర‌స్తుతం ఏపీ శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ స‌తీష్ రెడ్డి క‌ద‌లాడ‌తారు. పులివెందుల‌కు కృష్ణా జ‌లాల‌ను తీసుకొచ్చేదాకా గ‌డ్డం తీయ‌బోనంటూ శ‌ప‌థం చేసిన ఆయ‌న‌... మొన్న పైడిపాలెం రిజ‌ర్వాయ‌ర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏడాదిన్న‌ర త‌ర్వాత క్ష‌వ‌రం చేయించుకున్నారు. నిండా పెరిగిన గ‌డ్డంతో మొన్న‌టిదాకా స‌తీష్ రెడ్డి అన్ని ప‌త్రిక‌లు - టెలివిజ‌న్ల‌లో క‌నిపించారు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై పులివెందులలో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌తి సారి పోటీ చేయ‌డం ఓడిపోవ‌డంతో స‌తీష్ రెడ్డి జ‌నాల‌కు బాగా గుర్తుండిపోయారు. పెద్ద‌గా జ‌న బ‌ల‌మేమీ లేని స‌తీష్ రెడ్డి కేవ‌లం పులివెందుల‌లో వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డిపై పోటీ చేసిన కార‌ణంగానే బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చారు.

అయితే చాలా కాలం పాటు స‌తీష్ రెడ్డి ఒంట‌రి పోరును అంత‌గా ప‌ట్టించుకోని టీడీపీ అధినేత చంద్ర‌బాబు... ఇటీవ‌లే ఆయ‌న‌ను శాస‌న‌మండ‌లి స‌భ్యుడి ప‌ద‌వి ఇచ్చారు. ఆ త‌ర్వాత మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌విని కూడా ఇచ్చారు. ఈ ప‌దవీ కాలం ఇటీవలే ముగిసిపోయింది. ఇప్పుడు స‌తీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీనే. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... త‌న సొంతూరు వేంప‌ల్లెలో నిన్న మీడియా స‌మావేశం నిర్వ‌హించిన స‌తీష్ రెడ్డి మ‌రో శ‌ప‌థం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుంచే టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై పోటీ చేసి విజ‌యం సాధిస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగుపెడ‌తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న.. ఎన్నిక‌ల్లో ఓడిపోతే మాత్రం రాజ‌కీయ సన్యాసం తీసుకుని పూర్తిగా రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుంటాన‌ని తెలిపారు. పులివెందుల వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట కిందే లెక్క‌. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... దేశ‌వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నిక‌ల మెజారిటీ విష‌యానికి వ‌స్తే... పులివెందుల నుంచి గ‌తంలో వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి రికార్డు మెజారిటీని సాధించారు. అత్య‌ధిక మెజారిటీ న‌మోదైన నియోజ‌క‌వ‌ర్గాల్లో పులివెందుల తొలి రెండు, మూడు స్థానాల్లోనే ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ విజ‌య‌మ్మ కూడా భారీ మెజారిటీతోనే విజ‌యం సాధించారు.

ఆ త‌ర్వాత మొన్న‌టి ఎన్నికల్లో పులివెందుల నుంచి బ‌రిలోకి దిగిన వైఎస్ జ‌గ‌న్ రికార్డు మెజారిటీని సాధించారు. టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన స‌తీష్ రెడ్డికి 49333 ఓట్లు రాగా... వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన వైఎస్ జ‌గ‌న్‌ కు ఏకంగా 1,24,576 ఓట్లు ప‌డ్డాయి. ఈ మెజారిటీతో స‌తీష్ రెడ్డికి త‌ల‌బొప్పి క‌ట్ట‌గా... యావ‌త్తు దేశం ఈ నియోజ‌క‌వ‌ర్గ మెజారిటీపైనే చ‌ర్చించుకున్న ప‌రిస్థితి. ఇప్ప‌టికీ కూడా అక్క‌డ జ‌గ‌న్ ఫ్యామిలీదే హ‌వా. మ‌రి ఏం చూసుకుని స‌తీష్ రెడ్డి ఆ స‌వాల్ విసిరారో అర్థం కావ‌డం లేద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ దెబ్బ‌కు స‌తీష్ రెడ్డికి రాజ‌కీయ స‌న్యాసం త‌ప్ప‌ద‌న్న వాద‌న కూడా కాస్తంత గ‌ట్టిగానే వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/