Begin typing your search above and press return to search.

చంద్రబాబు కొత్త డిజైన్లపై సెటైర్లే సెటైర్లు

By:  Tupaki Desk   |   13 July 2017 6:21 AM GMT
చంద్రబాబు కొత్త డిజైన్లపై సెటైర్లే సెటైర్లు
X
అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తామని ఓ వైపు.. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, వారసత్వాలకు ప్రతీకగా నిలుపుతామని మరోవైపు.. ఇలా చంద్రబాబు ఏపీ నూతన రాజధాని అమరావతి గురించి చంద్రబాబు నిత్యం అనేక మాటలు వల్లిస్తుంటారు రెండూ వినడానికి బాగానే ఉంటాయి. అయితే... నిర్మాణానికి వచ్చేసరికే అటు ఆధునికతా లేదు, ఇలు సంస్కృతికి ప్రతీకగానూ లేదు అన్నట్లుగా తయారవుతోంది. తాజాగా ఏపీ అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి లండన్ సంస్థ నార్మన్ పోస్టర్స్ ఇచ్చిన డిజైన్లు చూసి సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి.

కాగా ఇంతకుముందు వేరే సంస్థ ఇచ్చిన డిజైన్లు అచ్చంగా అణువిద్యుత్ కర్మాగారంలా కనిపించడంతో అప్పట్లో పాకిస్థాన్ మీడియా కూడా ఏపీలో ఏదో భారీ అణుస్థావరం నిర్మిస్తున్నారని అనుమానించి కథనాలు ప్రచురించింది. దాంతో చంద్రబాబు ఇదేదో తేడా కొడుతోందని భావించి ఆ డిజైన్లకు తూచ్ చెప్పేశారు. ఇప్పుడు కొత్త డిజైన్లు వచ్చాయి... అయితే, వాటికీ, వీటికీ పెద్దగా తేడా ఏమీ లేదు. వాటిలో మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర ఏమీ కనిపించడం లేదు. అలా అని ఆధునిక నిర్మాణ శైలి కూడా కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పుడు కళ్లు చెదిరే నిర్మాణాలు కడుతున్నారు. వీటిలో ఆ కళ కూడా లేదు. దీంతో ఇవేం డిజైన్లంటూ సోషల్ మీడియాలో జనం ఏకిపారేస్తున్నారు.

అయితే... కవరింగ్ కోసమంటూ చంద్రబాబు కొత్త పల్లవి మాత్రం ఎత్తుకుంటున్నారు. అసెంబ్లీ వజ్రం ఆకారంలో ఉందని.. అది కోహినూర్ వజ్రానికి ప్రతీక అని చెప్పుకొంటున్నారు. ఇలా ఎన్ని కవరింగులు చేసినా ఈ ఆకృతులకు మాత్రం అందం చందం ఏమీ లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.