Begin typing your search above and press return to search.

40 రోజుల్లో ఆ ఉప‌గ్ర‌హం మ‌రో 'స్కైలాబ్'..!

By:  Tupaki Desk   |   6 Sep 2017 6:09 AM GMT
40 రోజుల్లో ఆ ఉప‌గ్ర‌హం మ‌రో స్కైలాబ్..!
X
మ‌రో భ‌యం మొద‌లైంది. ఏం కాద‌న్న భ‌రోసాను స్ప‌ష్టంగా ఇవ్వ‌ని నేప‌థ్యంలో.. ఆందోళ‌న‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ఇంత‌కీ ఈ స్కైలాబ్ ఏంది? ఉపగ్ర‌హం ఏంది? మ‌న మీద ప‌డ‌టం ఏంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఒక్కొక్క‌టిగా స‌మాధానాలు వెతికితే..

ఆగ‌స్టు 31న ఇస్రో ఒక ఉపగ్ర‌హాన్ని ప్ర‌యోగించిన సంగ‌తి తెలిసిందే. అంత‌రిక్షంలో ఉన్న ఒక‌ ఉప‌గ్ర‌హంలోని అణు గ‌డియారాలు ప‌ని చేయ‌ని నేప‌థ్యంలో  భార‌త్.. ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్-1హెచ్‌ ఉపగ్రహాన్ని ప్ర‌యోగించింది. దాదాపు 1.5ట‌న్నుల బ‌రువు ఉండే ఈ ఉపగ్ర‌హ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. దీంతో రోద‌సిలో ఉన్న ఈ ఉప‌గ్ర‌హం మ‌రో 40 రోజుల్లో భూవాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశిస్తుంద‌ని.. ఆ టైంలో అది కానీ పేలిపోతే ఆ శ‌క‌లాలు తీవ్ర న‌ష్టాన్ని క‌లిగిస్తాయ‌న్న భ‌యాందోళ‌న‌లు పెరుగుతున్నాయి.

అయితే.. ఇలాంటిదేమీ జ‌ర‌గ‌ద‌ని ఇస్రో కొట్టి పారేస్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌మాదానికి అవ‌కాశం లేక‌పోలేద‌న్న వాద‌న‌ను ఇస్రోలో ప‌ని చేసి రిటైర్ అయిన మాజీ శాస్త్ర‌వేత్త‌లు చెప్ప‌టం క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ఇంత‌కీ ఇస్రో ప్ర‌యోగించిన ఉప గ్ర‌హం ఎందుకు విఫ‌ల‌మైంద‌న్న విష‌యంలోకి వెళితే.. ఈ ఉప‌గ్ర‌హ ప్ర‌యోగంలో నాలుగో ద‌శ‌లో రాకెట్ హీట్ షీల్డ్ లోపంతో తెరుచుకోలేదు.

దీంతో అనుకున్న క‌క్ష్య‌లోకి ఉప‌గ్ర‌హం ప్ర‌వేశించ‌లేదు. ఇప్పుడు హీట్ షీల్డ్ లో ఉన్న ఈ ఉప‌గ్ర‌హం భూవాతావ‌ర‌ణంలోకి తిరిగి వ‌స్తోంది. అది మ‌రో 40-50 రోజుల్లోపు భూక‌క్ష్య‌లోకి ప్ర‌వేశిస్తుంద‌ని చెబుతున్నారు.భూక‌క్ష్య‌లో ప్ర‌వేశించే స‌మ‌యంలో కానీ పేలిపోతే దాని శ‌క‌లాలు తీవ్ర న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. అయితే.. అలా జ‌ర‌గ‌ద‌ని ఇస్రో చెబుతోంది. ఇప్పుడున్న అంచ‌నాల ప్ర‌కారం భూమికి దూరంగా ఉన్న‌ప్పుడు ఈ ఉప‌గ్ర‌హం అపోజి 6,400 కిలోమీట‌ర్లుగా చెబుతున్నారు.

భూ వాతావ‌ర‌ణంలోకి చేర‌టానికి  36 గంట‌ల ముందు మాత్ర‌మే అదెక్క‌డ కూలుతుంద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌న్న మాట ప‌లువురి నోట రావ‌టం కొత్త ఆందోళ‌నల్ని రేకెత్తిస్తోంది. అయితే.. త‌మ‌కున్న అంచ‌నా ప్ర‌కారం ఈ ఉప‌గ్ర‌హం స‌ముద్రంలో ప‌డ‌తాయ‌ని భావిస్తున్న‌ట్లుగా ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఏది ఏమైనా.. భూ వాతావ‌ర‌ణానికి ద‌గ్గ‌ర‌గా రావ‌టానికి 36 గంట‌ల ముందే ఏం జ‌రుగుతుంద‌న్న దానిపై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే వీలుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌రో స్కైలాబ్ గా అభివ‌ర్ణిస్తున్న ఈ ఉపగ్ర‌హం వ్య‌వ‌హ‌రం ఇలా ఉంటే.. ఇంత‌కీ స్కైలాబ్ ఏమిట‌న్న సందేహంలోకి వెళితే.. డెబ్బై ద‌శ‌కంలో అమెరికా ప్ర‌యోగించిన తొలి మాన‌వ స‌హిత అంత‌రిక్ష కేంద్రం 1979 జులై 11న కూలిపోయింది. అది కూల‌టానికి ముందు పెద్ద ఎత్తున భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. స్కైలాబ్ మీద ప‌డుతుంద‌ట‌.. దాంతో మ‌నుషులంతా చ‌నిపోతార‌ట అన్న వదంతులు జోరుగా సాగాయి.

ఈ నేప‌థ్యంలో బ‌తికి ఉన్న నాలుగు రోజులు ఎంజాయ్ చేద్దామ‌న్న ఉద్దేశంతో ఆరాచ‌కం ప్ర‌బ‌లింది. ఈ వదంతుల తీవ్రత‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా పాకి.. తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యేలా చేసింది. చివ‌ర‌కు ఈ స్కైలాబ్ ఆస్ట్రేలియాకు స‌మీపంలోని స‌ముద్రంలోకి కూలిపోయింది. ఎవ‌రికీ ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌లేదు. కాకుండే.. ఆస్ట్రేలియాలోని ఒక వ్య‌క్తి ఇంట్లో స్కైలాబ్ శ‌క‌లాలు ప‌డ్డాయి. నాటి స్కైలాబ్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. తాజాగా ఇస్రో ప్ర‌యోగించిన ఉప‌గ్ర‌హం భూమి మీద ప‌డిపోతుంద‌న్న వాద‌న‌ల్ని కొంద‌రు వినిపిస్తున్నారు. ఏమైనా.. మ‌రో 40-50 రోజులు ఈ టెన్ష‌న్ ఇదే రీతిలో కొన‌సాగటం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.