Begin typing your search above and press return to search.

సోమవారం కూడా తీర్పు రానట్లే

By:  Tupaki Desk   |   12 Feb 2017 4:51 AM GMT
సోమవారం కూడా తీర్పు రానట్లే
X
తమిళనాట రాజకీయం ఇప్పుడు చిత్రంగా మారింది. ముఖ్యమంత్రిని నియమించాల్సిన గవర్నర్.. తన నిర్ణయాన్ని సుప్రీంతో లింకు పెట్టుకొని కూర్చున్నారు. తీర్పు ఇస్తామన్న సుప్రీం.. ఇప్పుడా ఊసు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఇలా.. ఒకదానితో మరొకటి లింకులు ఉండటంతో.. తుది నిర్ణయం వెలువడకపోవటం.. రాజకీయ సంక్షోభం రోజుల తరబడి సాగుతూ ఉండటం గమనార్హం.

ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న విసయంలో గవర్నర్.. సుప్రీంతీర్పు ఆధారపడటం ఎందుకన్న విషయంలోకి వెళితే.. అక్రమాస్తుల కేసులో నాడు అమ్మతో పాటు.. ఆమె నెచ్చెలి శశికళపైనా ఆరోపణలువెల్లువెత్తాయి. దీనికి తగ్గట్లే ఇరువురి మీదా కేసులు నమోదయ్యాయి. ఈ ఉదంతంలో వారు ఇరువురు కొన్నాళ్లుజైల్లో ఉండి వచ్చారు. ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కుర్చీలో కూర్చోవాలని భావిస్తున్న చిన్నమ్మకు.. అక్రమాస్తుల కేసు అడ్డుగా నిలిచింది.

ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును వారం వ్యవధిలో ఇచ్చేస్తామంటూ సుప్రీం చెప్పిన నేపథ్యంలో.. చిన్నమ్మను ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్ వెనకడుగు వేశారనే చెప్పాలి. మరోవైపు.. ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉంటే.. తన చేత ప్రమాణస్వీకారం ఎందుకు చేయించరనే మాటను శశికళ లేవనెత్తుతున్నారు.

సభలో సభ్యురాలు కాని శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన పక్షంలోఆరు నెలల లోపుసభకు ఎన్నికయ్యేలా చూడాలి. ఒకవేళ.. ఆమెపై ఉన్నఅక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ జరిగితే.. ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే ఉండదు. అందుకే.. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ముందస్తుగా వారం నుంచి గవర్నర్ నిర్ణయం తీసుకునే విషయంలో ఏటూతేల్చేకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం అయినా సుప్రీం లోవిచారణ జరిగే లిస్ట్ లో చిన్నమ్మ కేసు ఉంటుందని అందరూ ఆశించారు.

అయితే.. అలాంటిది లేకపోవటంతో సోమవారం కూడా తీర్పు వచ్చే అవకాశం లేదని తేలింది. సుప్రీం నిర్ణయానికి తగ్గట్లుగా తన నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్న గవర్నర్ ఇప్పుడేంచేస్తారన్నది ఉత్కంఠగా మారిందని చెప్పక తప్పదు.