Begin typing your search above and press return to search.

శశికళ రాజకీయ జీవితం ఖతం.. ఎందుకు వైదొలిగింది.

By:  Tupaki Desk   |   4 March 2021 4:23 AM GMT
శశికళ రాజకీయ జీవితం ఖతం.. ఎందుకు వైదొలిగింది.
X
తమిళనాడును ఊపేయాలనుకొని జైలు నుంచి విడుదలైన జయలలిత స్నేహితురాలు శశికళ ఎందుకు సడెన్ గా రాజకీయ సన్యాసం తీసుకుంది. తమిళనాడు సీఎం కావాలనుకున్న ఆమె ఎందుకు సడెన్ గా రాజకీయ తెరపై నుంచి వైదొలిగింది. గత ఎన్నికల వేళ శశికళను జైలుకు పంపిన బీజేపీ ఒత్తిడి కారణమా? ఇంకా ఏమైనా కారణాలున్నాయా? తొడగొట్టిన శశికళను పడగొట్టింది ఎవరన్న చర్చ ఇప్పుడు తమిళనాట సాగుతోంది.

అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో దోషిగా నాలుగేళ్ల జైలు శిక్షను శశికళ పూర్తి చేసుకుంది. జనవరిలో విడుదలైన వీకే శశికళ తనను బహిష్కరించిన అన్నాడీఎంకే పార్టీపై తిరిగి పట్టు సాధించబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మొన్న జయలలిత జయంతి నాడు కూడా తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఆమె ఇంటికి క్యూకట్టడం, దాంతో శశికళ మళ్లీ జూలు విదిలించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

కానీ.. వాటన్నింటికీ రివర్సులో శశికళ ఏకంగా రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి తప్పుకున్నారు. పొలిటికల్, పబ్లిక్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘జయ(దివంగత తమిళనాడు సీఎం జయలలిత) అధికారంలో ఉన్నప్పుడు గానీ, పదవిలో లేనప్పుడు గానీ నేను ఏనాడూ అధికారం, పదవి కోసం అర్రులు చాచలేదు. జయ మరణం తర్వాత కూడా ఆ రెండిటినీ (పదవి, అధికారం) నేను కోరుకోలేదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. అయితే.. జయ స్థాపించిన పార్టీ (ఏఐఏడీఎంకే) గెలవాలని ప్రార్థిస్తున్నాను. ఆమె వారసత్వం కలకాలం కొనసాగుతుంది’ అని వీడ్కోలు లేఖలో శశికళ పేర్కొన్నారు.

జనవరిలో శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత పొలిటికల్ సీన్ అటు ఇటు అయినట్లు కనిపించడం, అన్నాడీఎంకేపై శశికళ తిరిగి పట్టు బిగిస్తే బీజేపీతో కలిసి పోగలరా? అని, ఒక వేళ శశికళ తోకజాడిస్తే మళ్లీ జైలుకు పంపేందుకూ బీజేపీ వెనుకాడబోదనే వాదనలను విస్తృతంగా వినిపించాయి. చివరికి రాజకీయాల నుంచి, ప్రజాజీవితం నుంచి పూర్తిగా తప్పుకోవడం ద్వారా సైలెంట్ అయిపోవాలనే శశికళ నిర్ణయించుకోవడం డీల్‌లో భాగంగా జరిగిందేనా? అనే కామెంట్లు వస్తున్నాయి. ఈ పరిణామంతో ఆమెనే నమ్ముకున్న దినకరన్ ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.