Begin typing your search above and press return to search.

కోర్టు నిబంధనల్ని తుంగలో తొక్కేస్తోంది!

By:  Tupaki Desk   |   9 Oct 2017 8:15 AM GMT
కోర్టు నిబంధనల్ని తుంగలో తొక్కేస్తోంది!
X
ఆమె అంతే.. తాను తలచుకున్నదే చేస్తారు తప్ప... కోర్టు చెప్పిందనో.. మరొకరు చెప్పారనో ఎలాంటి విధినిషేధాలను, నిబంధనలను పాటించరు గాక పాటించరు! అందుకే తమిళ రాజకీయాలలో ఆమె ఒక మోనార్క్. ఇప్పుడు తన మోనార్క్ శైలినే ఆమె ప్రదర్శిస్తున్నారు. ఆమె మరెవ్వరో కాదు.. నిన్నటి వరకు రెండాకుల పార్టీకి - ఇవాళ కేవలం కొందరు ఎంపీలకు మాత్రం ‘చిన్నమ్మ’.. శశికళ. కర్నాటక లోని పరప్పన అగ్రహారం జైలు నుంచి పెరోల్ పై - భర్తను పరామర్శించడం కోసం తమిళనాడు చెన్నై కు వచ్చిన శశికళ ఎడాపెడా రాజకీయ వ్యవహారాలను నడిపిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

శశికళ అటు ఆస్పత్రి ఆవరణలోకి అడుగుపెట్టినా - తిరిగి బస నిమిత్తం తన మేనకోడలు ఇంటికి వచ్చినా ఆమెను లెక్కకు మిక్కిలిగా అనుచరులు - అభిమానులు ఎంపీలు - వేటు పడిన ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. ఎక్కడికక్కడ రాజకీయ మంతనాలు సాగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ప్రయాణంలో 3 వాహనాలకు మించి వాడకూడదని కోర్టు నిబంధన విధించినప్పటికీ.. ఆమె ఖాతరు చేయకుండా 7 వాహనాల్ని వాడుతున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి.

అయితే తమిళనాడు లోని పళని- పన్నీర్ ప్రభుత్వం శశికళ పెరోల్ కదలికల మీద డేగకన్ను వేసి ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆమె ఎక్కడెక్కడ ఎవరెవరిని కలుస్తోంది. ఆమె కదలికలు రాజకీయ భేటీలను తలపించేలా ఎలా సాగుతున్నాయి. లాంటి విషయాలను పరిశీలించడానికి ఇంటెలిజెన్స్ పోలీసులను కూడా నియమించినట్లుగా చెప్పుకుంటున్నారు.

మొత్తానికి అన్నా డీఎంకే నుంచి బహిష్కృత నాయకురాలిగా.. ఉన్న శశికళ చెన్నైలో పెరోల్ పై అడుగుపెట్టిన సమయం నుంచీ రాజకీయాల మీదనే దృష్టి పెట్టినట్లుగా వ్యవహారం కనిపిస్తోంది. బంధువులను తప్ప రాజకీయ నాయకులను కలిసినట్టుగా కనిపించకుండానే.. తన మరో మేనల్లుడు జై ఆనంద్ ను కొత్తగా తెరమీదికి తెచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. శశికళ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉండడం.. టీటీవీ దినకరన్ కూడా ప్రస్తుతం బెయిలు మీదే బయట ఉన్న వ్యక్తి కావడంతో.. మరో మేనల్లుడు జైఆనంద్ ను ఈ అయిదు రోజుల వ్యవధిలోనే తన ప్రతినిధిగా అనుచరులకు తెలియజెప్పి.. తిరిగి జైలుకు వెళ్లిన తర్వాత.. అతని ద్వారా రాజకీయాలను నడిపించడానికి చిన్నమ్మ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. రాజకీయ భేటీలు జరగకూడదు, రాజకీయంగా ఎవ్వరినీ కలవకూడదు.. ఈ పెరోల్ ను కేవలం ఆస్పత్రిలో ఉన్న భర్తను పరామర్శించడానికి మాత్రమే వాడుకోవాలి.. లాంటి కోర్టు నిబంధనలు శశికళ కదలికల మీద ఏమాత్రం ప్రభావం చూపిచండం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

కాకపోతే.. ఆమె తిరిగి జైలుకు వెళ్లిన తర్వాత అయినా.. ఇప్పటి కదలికల మీద నిఘా వర్గాల నివేదికను బయటపెడతారని, ఆమె రాజకీయ భేటీలు కూడా జరిపినట్లుగా కొత్త ఫిర్యాదులను కూడా ఆమె మీద పెడతారని కొందరు భావిస్తున్నారు.