Begin typing your search above and press return to search.

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ

By:  Tupaki Desk   |   5 Feb 2017 4:04 PM IST
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ
X
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ఎన్నికయ్యారు. దివంగత సీఎం జయలలితకు అత్యంత సన్నిహితురాలైన ఆమెను తమ శాసనసభాపక్ష నేతగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వమే ఆమె పేరును ప్రతిపాదించడం విశేషం. కాగా పార్టీ ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తరువాత శశికళ పొయెస్‌ గార్డెన్‌నుంచి ఎఐఎడిఎంకె కార్యాలయానికి బయలుదేరారు.

నిన్నటి నుంచి ఊహాగానాలు తీవ్రం కాగా.. ఆ నేపథ్యంలోనే పోయెస్‌ గార్డెన్‌లో ఈ రోజు కీలక భేటీ జరిగింది. శశికళతో ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. శశికళకు ముఖ్యమంత్రి పదవి అప్పగించడంపై ఈ భేటీలో చర్చించారు. పేరుకు అది చర్చ అని చెప్పినా అంతా ముందుగా అనుకున్నట్లుగా చేశారన్నట్లుగా నిమిషాల్లో ఆమె పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించడం అంతా ఏకగ్రీవకంగా ఆమోదించడం జరిగిపోయాయి.

చిన్నమ్మ శశికళకు మార్గం సుగమం చేస్తూ ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేశారు. కాగా ప్రస్తుతం ఎన్నికైన పదవుల్లో లేని శశికళ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానం నుంచే ఆమె పోటీ చేస్తారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/