Begin typing your search above and press return to search.

శశికళను ఇబ్బంది పెడుతున్న ఫొటో

By:  Tupaki Desk   |   7 Feb 2017 8:40 AM GMT
శశికళను ఇబ్బంది పెడుతున్న ఫొటో
X
అమ్మను అభిమానించిన తమిళ ప్రజలు చిన్నమ్మను మాత్రం ఏమాత్రం ఆమోదించడం లేదు. రాజకీయంగా చక్రం తిప్పి పార్టీని మొత్తం తన వైపు తిప్పుకొని పార్టీ అధ్యక్ష పదవి సొంతం చేసుకోవడమే కాకుండా సీఎం పదవికి కూడా తననే ఎన్నుకునేలా చేసుకున్న చిన్నమ్మ శశికళ ప్రజామోదం మాత్రం పొందలేకపోతోంది. పైగా.. నిన్నమొన్నటి వరకూ శశికళే సీఎం అని భావించిన వారంతా కోర్టు ప్రకటనతో సీఎం అవుతుందో లేదో అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తాము ఓటేసి ఎన్నుకున్న నేత ఆమె కాదని.. ఆమెను తాము ఆమోదించబోమంటూ జనం మండిపడుతున్నారు. నెట్ లో ఆమెకు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. శశికళ జయకు సేవకురాలని.. రాజకీయ వారసురాలిగా మారుతానంటే ఒప్పుకొనేది లేదని అంటున్నారు. అందుకు సాక్ష్యంగా పాత చిత్రాన్ని కొందరు ఇంటర్ నెట్లో పోస్టు చేశారు. ఆ ఫోటో ఇప్పుడు హల్‌ చల్ చేస్తోంది. జయలలిత సినిమాల్లో నటించే సమయంలో నడుచుకుంటూ వస్తుండగా తీసిన ఫోటో అది. ఆ ఫోటోలో జయలలిత వెనుక ఓ మహిళ బాక్స్ పట్టుకుని వస్తోంది. ఆ ఫోటోలో ఉంది శశికళేనంటూ ప్రచారం జరుగుతోంది.

జయలలిత వెనుక పనిమనిషిలా నిల్చున్న శశికళ తమిళనాడుకు సీఎం అవ్వడాన్ని ఏ మాత్రం సహించబోమంటూ నెటిజన్లు దాన్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఆ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే... ఈ ఫోటోలో ఉన్నది శశికళేనా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి శశికళకు మాత్రం ప్రజల నుంచి ఏమాత్రం మద్దతు దొరకడం లేదన్నది సత్యం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/