Begin typing your search above and press return to search.

ఆధ్యాత్మిక జీవనంలో శశికళ .. అదే కారణం !

By:  Tupaki Desk   |   29 Nov 2020 11:40 AM IST
ఆధ్యాత్మిక జీవనంలో శశికళ .. అదే కారణం !
X
శశికళ జైలు నుండి ఎంత త్వరగా బయటకి రావాలని అనుకుంటుందో .. అంతే ఫాస్ట్ గా ఆమె కి అడ్డంకులు వచ్చి పడుతున్నాయి. జైలు నుండి ముందస్తుగా విడుదల కావాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే , ముందస్తు విడుదలకి కర్ణాటక జైళ్లశాఖ ఒప్పుకోలేదు. దీంతో మనుషులను నమ్మి ప్రయోజనం లేదు.. దేవుడే దిక్కు అని శశికళ భావించారో ఏమో ఆధ్యాత్మిక జీవనంలో మునిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరిలోని శశికళ విడుదలపై ఆసక్తి నెలకొంది. జయలలిత హయాంలోనే అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ ఆ తరువాత పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచుకున్నారు. అయితే చివరి నిముషం లో జైలుకి వెళ్లాల్సి వచ్చింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అనుభవిస్తున్న నాలుగేళ్ల జైలు శిక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంతో పూర్తయి విడుదల కావాల్సి ఉంది. అయితే , కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి నెలరోజుల జైలు జీవితానికి మూడు సెలవు రోజుల చొప్పున మొత్తం 129 రోజుల సెలవులను బేరీజు వేసుకుని నవంబరులోనే విడుదల చేయాలని శశికళ తరఫున్యాయవాది గతంలో బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు. ఇక అప్పటి నుంచి శశికళ ముందుస్తు విడుదల వ్యవహారం నిత్యం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు విడుదల అడ్డంకిగా ఉండిన రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించి ఆశగా ఎదురుచూడడం ప్రారంభించారు.

నరసింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని జైలు సూపరింటెండెంట్‌ బదులిచ్చారు. అవినీతినిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. జరిమానా చెల్లింపు, కోర్టు ఆమోదం పూర్తయినందున సత్ప్రవర్తన కింద ముందే విడుదల చేయాలని కోరుతూ జైళ్లశాఖకు ఈనెల 17న శశికళ న్యాయవాదులు మరోసారి వినతిపత్రం సమర్పించారు. శశికళ చెన్నై జైల్లో ఉన్న రోజులు, పెరోల్‌ రోజులు, సెలవు దినాలు పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. అయితే ఈ వినతిని జైళ్లశాఖ నిరాకరించడంతో శశికళకు మళ్లీ నిరాశే మిగిలింది. దీనితో జైల్లోని తనగదిలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు పెట్టుకుని రోజుకు నాలుగు గంటలపాటు పూజలు చేస్తున్నారు.