Begin typing your search above and press return to search.

అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డికి జరిగే మేలేంటి?

By:  Tupaki Desk   |   2 Jun 2023 1:00 PM GMT
అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డికి జరిగే మేలేంటి?
X
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కేసులో ఏ7గా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోవటం తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడైన శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

దీనికి కోర్టు సైతం ఓకే చెప్పటం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాల్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు తాను సిద్ధమేనని.. అప్రూవర్ గా మారేందుకు తనను అనుమతించాలని కోరిన ఆయన వినతిని రౌజ్ అవెన్యూ లోని సీబీఐ.. ఈడీ కేసుల ప్రత్యేక కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది.

రాజకీయంగా పెను సంచలనాలకు తెర తీస్తుందన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారటం ద్వారా ఏం జరుగుతుంది? ఏం జరగనుంది? ఆయనకు కలిగే మేలు ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఈ విషయంలోకి వెళితే.. శరత్ చంద్రారెడ్డి ఇప్పటివరకు ఈ కేసులో నిందితుడిగా వ్యవహరించారు. ఇకపై ఆయన సాక్షిగా లేదంటే అప్రూవర్ గా మారతారు.

ప్రాసిక్యూషన్ సమయంలో మిగిలిన నిందితులకు వ్యతిరేకంగా ఆయన సాక్ష్యం చెప్పటానికి వీలు ఉంటుంది. నేరానికి సంబంధించి సంపూర్ణమైన వాస్తవాలు వెల్లడించాలన్న షరతుతోనే కోర్టు అప్రూవర్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తుంది. నేరంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగానో పాల్గొన్న వారు అప్రూవర్ గా మారినప్పుడు సీఆర్పీసీ సెక్షన్ 306 కింద చట్టపరంగా క్షమాభిక్షను ప్రసాదిస్తారు.

దీనికి ప్రతిఫలంగా సదరు వ్యక్తి.. నేరం జరిగిన తీరు.. దానికి సంబంధించినఅంశాలతో పాటు.. ఆయా తప్పులు చేసిన వ్యక్తులు.. వారికి కలిగిన ప్రయోజనాలతో పాటు.. అందుకు సాక్ష్యాలను అందిస్తారు.దర్యాప్తు సంస్థలకు సహకరిస్తారు. దర్యాప్తు.. విచారణ ఏ దశలో అయినా క్షమాభిక్ష ప్రసాదించొచ్చు.

జైలు ముప్పు తొలగటంతో పాటు.. కోర్టు క్షమాభిక్ష్ కారణంగా ఆయన కేసు తిప్పల నుంచి బయట పడే వీలు కలుగుతుంది. అయితే.. ఆయన నోటి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఇరుకున పడే వీలు ఉంటుందని చెప్పాలి.