Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: సంతనూతలపాడు'లు హీరో ఎవరో..?

By:  Tupaki Desk   |   30 March 2019 5:00 PM IST
గ్రౌండ్ రిపోర్ట్: సంతనూతలపాడులు హీరో ఎవరో..?
X
అసెంబ్లీ నియోజకవర్గం: సంతనూతలపాడు

టీడీపీ: బిఎన్‌ విజయ్‌ కుమార్‌

వైసీపీ: టి.సుధాకర్‌ బాబు

ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో కరువు తాండవిస్తోంది. కానీ సంతనూతలపాడు నియోజకవర్గం మాత్రం ఆర్థికంగా పటిష్టంగానే ఉంది.. చీమకుర్తి మండలంలో ఉన్న గ్రానైట్‌ క్వారీలతో వేల మందికి ఉపాధినిస్తుండడంతో పాటు నియోజకవర్గానికి ఆదాయాన్ని తెస్తోంది. మిగతా మండలాల్లో వ్యవసాయమే ప్రధాన ఆయన వనరు. మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించారు. కానీ కాలువల నిర్మాణం జరగలేదు. కాలువలు నిర్మిస్తామని హామీలివ్వడంతో నాయకులు గెలుస్తున్నారు. కానీ ఆ తరువాత హామీలను మరిచిపోతున్నారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక గత 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందిన ఆదిమూలపు సురేశ్‌ ఈసారి సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలెం నుంచి బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ వైసీపీ తరుపున టి.సుధాకర్‌బాబుకు టికెట్‌ కేటాయించారు జగన్‌. పోయిన సారి పోటీచేసిన ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి బీఎన్‌ విజయకుమార్‌ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

* సంతనూతలపాడు చరిత్ర

మండలాలు: మద్దిపాడు - సంతనూతలపాడు - చీమకుర్తి - నాగులుప్పలపాడు

ఓటర్లు: లక్షా 80 వేలు

ఎస్సీ రిజర్వుడుగా ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎక్కువసార్లు గెలుపొందింది. 1999 ఎన్నికల్లో ఒకసారి మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ తరుపున పోటీ చేసి డేవిడ్‌ రాజు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. గత ఎన్నికల్లో బిఎన్‌ విజయ్‌ కుమార్‌ పై ఆదిమూలపు సురేశ్‌ గెలుపొందారు. అయితే టీడీపీ మరోసారి విజయ్‌ కుమార్‌ కే కేటాయించగా వైసీపీ మాత్రం అభ్యర్థిని మార్చింది.

* టీడీపీ అభ్యర్థి బీఎన్‌ విజయ్‌ కుమార్‌ ఈసారైనా గెలుస్తాడా..?

2014 ఎన్నికల్లో ఓడిన టీడీపీ అభ్యర్థి బిఎన్‌ విజయ్‌ కుమార్‌ పై సానుభూతి పెరిగింది. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టీడీపీ ఈ నియోజకవర్గంలో ఒకేసారి గెలిచింది. దీంతో రెండోసారి గెలిచేందుకు చంద్రబాబు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే సురేశ్‌ పై వ్యతిరేకత రావడంతో ఆ ఓట్లు తనకే పడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

* అనుకూలతలు:

-సానుభూతి రావడం
-టీడీపీ బలపడడం
-గత ఎమ్మెల్యేపై వచ్చిన వ్యతిరేకత

* కొత్త వైసీపీ అభ్యర్థి సుధాకర్‌బాబుకు పట్టం కడుతారా..?

గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వైసీపీ అభ్యర్థి సురేశ్‌ పై తీవ్ర ఆరోపణలు రావడంతో పాటు ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయారు. దీంతో సంతనూతలపాడు నియోజకవర్గాన్ని వైసీపీ అధినేత జగన్ సుధాకర్‌ బాబుకు కేటాయించారు. అటు వైసీపీ బలంగా ఉండడంతో తన గెలుపు ఖాయమనే ఆశలు పెరిగాయి. అయితే గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే తాము అధికారంలో లేనందున అభివృద్ధి జరగలేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రభావం సుధాకర్‌పై పడనుందా..? అనే చర్చ జరుగుతోంది.

* అనుకూలతలు:

-వైసీపీ కేడర్‌ బలంగా ఉండడం
-సామాజికవర్గ సపోర్టు
-జగన్‌ ఇమేజ్‌ తో ఓట్లు పడే అవకాశం

* ప్రతికూలతలు:

-నాన్‌ లోకల్‌ కావడం
-ఆర్థికంగా వీక్‌గా ఉండడం

*సంతనూతలపాడులో పోరు ఉత్కంఠ..

సంతనూతలపాడులో జనసేన పోటీచేయడం లేదు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గంలో సీపీఎం పోటీ చేస్తోంది. గతంలో ఓ సారి కమ్యూనిస్టులు విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గాన్ని వారు ఎంచుకున్నారు. దీంతో వీరు పోటా పోటీలో రాకున్నా ఓట్లు చీల్చే అవకాశముందని అంటున్నారు. అయితే టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తుందని టీడీపీ ప్రచారం చేస్తుండగా.. తనను గెలిపిస్తే గుండ్లకమ్మ ప్రాజెక్టు కాలువల నిర్మాణం పూర్తి చేస్తానని సుధాకర్‌ బాబు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ - వైసీపీ హోరా పోరులో ఎవరైనా నెగ్గవచ్చంటున్నారు.