Begin typing your search above and press return to search.

బాబు సంక్రాంతి బిచ్చగాడు !

By:  Tupaki Desk   |   13 Jan 2020 10:21 AM GMT
బాబు సంక్రాంతి బిచ్చగాడు !
X
ఏపీలో మూడు రాజధానుల విషయం లో ఇంకా రగడ కొనసాగుతుంది. సీఎం జగన్ ఈ ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక చంద్రబాబు సైతం అమరావతి పరిరక్షణా సమితి నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే మద్దతు ర్యాలీల లో పాల్గొంటున్నారు. జోలె పట్టి అమరావతి కోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి, హైపవర్ కమిటీ సభ్యుడు కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితిపై ఆయన సెటైర్లు వేశారు.

సంక్రాంతికి బిచ్చగాని గెటప్ వేసిన చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో రాజకీయ పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ నాని ఫైర్ అయ్యారు. సోమవారం జరిగిన హైపవర్ కమిటీ సమావేశం తర్వాత కొడాలి నాని చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు గుప్పించారు. సంక్రాంతికి బిచ్చగాడి వేషం వేసిన చంద్రబాబు వీధుల్లో జోలె పట్టి అడుక్కున్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ దెబ్బకు చంద్రబాబు అలా మారిపోయారని నానీ వ్యాఖ్యానించారు . చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ఏపీ ప్రజలు ఇక జన్మలో నమ్మరని తెలిపారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి అమరావతికి వచ్చారని అన్నారు.

గతంలో తమ ప్రభుత్వ హయాం లో తాను చేసిన పాపాలకు అడుక్కునే పరిస్థితి కి చంద్రబాబు చేరుకున్నారని , చంద్రబాబు పగటి వేషగాడిలా మారి పోయారని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తమ పార్టీ కి 60 లక్షల సభ్యత్వం వుందని చెబుతున్నారని అయితే టీడీపీ సమావేశాలకు 500 మంది కూడా రావడం లేదని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు . చంద్రబాబు మాటలు వింటే రైతులకు న్యాయం జరగదు అని , రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుతం దృష్టికి తమ సమస్యలను తీసుకురావాలని నానీ సూచించారు . రాష్ట్రంలో కావాలని చంద్రబాబు అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పిన నానీ నేడు హైపవర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.