Begin typing your search above and press return to search.

ద‌ళిత మాట‌తో నెట్టుకొస్తారా సంజ‌య్‌

By:  Tupaki Desk   |   2 Feb 2022 7:35 AM GMT
ద‌ళిత మాట‌తో నెట్టుకొస్తారా సంజ‌య్‌
X
రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాటల యుద్ధం సాధ‌ర‌ణ‌మే. త‌మ పార్టీపై ప్ర‌త్య‌ర్థి నేత‌లు మాట‌ల దాడిలో పైచేయి సాధించ‌కుండా ఉండాల‌నే నాయ‌కులంద‌రూ చూస్తారు. అందుకే ఎవ‌రైనా ఒక మాట అన‌గానే.. అంత‌కు ప‌ది రెట్లు విరుచుకుప‌డ‌తారు. ఇప్పుడు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య ఈ మాట‌ల పోరు కొన‌సాగుతోంది. రాష్ట్రంలో పుంజుకుంటున్న కాషాయ పార్టీకి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ బీజేపీని ల‌క్ష్యంగా చేసుకున్నారు. మ‌రోవైపు బీజేపీ కూడా కేసీఆర్ మాట‌కు మాట బ‌దులిస్తోంది. కానీ ఈ క్ర‌మంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

తాజాగా కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు చేస్తోంది. రాష్ట్రానికి మ‌రోసారి అన్యాయ‌మే జ‌రిగింద‌ని ఆర్థిక నిపుణులు కూడా అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో విలేక‌ర్ల స‌మావేశం పెట్టిన కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా విమ‌ర్శించారు. వివిధ స‌మ‌స్య‌ల‌ను ఏక‌ర‌వు పెట్టి రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ఎండ‌గ‌ట్టారు. బడ్జెట్ అంతా ఓ గోల్‌మాల్ గోవిందం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే దేశాన్ని అమ్ముడు.. ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌ను అమ్ముడు.. మ‌త పిచ్చి లేపుడు అని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దేశాన్ని బాగు చేయాలంటే కొత్త రాజ్యాంగం అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయప‌డ్డారు.

కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో విలేక‌ర్ల‌తో మాట్లాడిన బండి సంజ‌య్ ద‌ళితుడు అనే మాట‌ను ఎత్తుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్క‌ర్‌ను కేసీఆర్ అవ‌మానించార‌ని సంజ‌య్ అన్నారు. అంతే కాకుండా రాష్ట్రప‌తి ద‌ళితుడు కాబ‌ట్టి ఆయ‌న ప్ర‌సంగాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బ‌హిష్క‌రించార‌ని సంజ‌య్ పేర్కొన్నారు. ద‌ళితుల విష‌యంలో కేసీఆర్ కుట్ర చేస్తున్నార‌ని, ఇప్పుడైనా ద‌ళిత స‌మాజం స్పందించకుంటే ఆయ‌న ఎంత‌కైనా తెగిస్తార‌ని సంజ‌య్ అన్నారు. కేంద్ర‌మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ కుంభ‌కోణాల‌ను బ‌య‌ట‌కు తీసి అరెస్టు చేయిస్తామ‌ని చెప్పారు.

అయితే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోంద‌ని, అందుకే రాష్ట్రప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రించి అసంతృప్తి వ్య‌క్తం చేయాల‌ని కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీల‌కు సూచించారు. అలాంటిది ఇప్పుడు దానికి సంజ‌య్ ద‌ళిత రంగు పూయ‌డం ఏమిట‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని ద‌ళితులంద‌రికీ ద‌ళిత బంధు అమ‌లు చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒకే అది సంక్షేమ ప‌థ‌కం కాబ‌ట్టి ఇలా డిమాండ్ చేయ‌డంలో త‌ప్పు లేదు. కానీ రాష్ట్రప‌తి ద‌ళితుడ‌ని, అందుకే టీఆర్ఎస్ ఎంపీలు ఆయ‌న ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రించార‌న‌డం స‌రికాద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎప్పుడూ మ‌తం, కులం పేరుతోనే రాజ‌కీయాలు చేయ‌డం బీజేపీ మానాల‌ని సూచిస్తున్నారు.